Food Infections:ఫుడ్ ఇన్ ఫెక్షన్లు దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

By manavaradhi.com

Published on:

Follow Us
Food Infections

మనిషి శరీరానికి ఇంధనం ఆహారం. అలాంటి ఆహారం కలుషితం అయితే అది శరీరంలో ఏ భాగాన్నయినా నాశనం చేయగలదు.పట్టణీకరణ పెరగడంతో ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహార పదార్ధాలు తినడం, కలుషిత నీటిని తాగడం వలన తరచూ ఆసుపత్రులపాలు కావాల్సి వస్తోంది. పుడ్ పాయిజినింగ్ వలన మొదట దెబ్బతినేది జీర్ణవ్యవస్థ. ఆ తరువాత కలుషిత తీవ్రతను బట్టి మిగతా శరీర వ్యవస్థలు దెబ్బతింటాయి.

హడావుడిగా ఆఫీసుకు పరిగెత్తామా…,ఆకలి వేసిన వెంటనే చేతికందినదేదో తిన్నామా … అన్నట్టు తయారయ్యంది సగటు నగర వాసి జీవితం. ఉరుకులు, పరుగుల జీవితంలో ఏం తింటున్నామో.., ఎలా తింటున్నామో కూడా పట్టించుకోలేనంత బిజీ అయిపోతున్నారు. అయితే ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఏ మనిషి ఆరోగ్యం అయినా ఎలా ఉంది?, అతను ఎంత కాలం జీవిస్తాడు అనేది అతను తీసుకునే ఆహారం బట్టే ఉంటుంది. అంతటి ముఖ్యమైన విషయం నిర్లక్ష్యం చేయడంతో పుడ్ ఇన్ ఫెక్షన్లు సాధారణమైపోతున్నాయి.

నోటికి రుచి తెలుస్తుంది. కడుపు ఆకలి తీర్చడం అవసరం. అయితే ఈ రెండింటి కోసం చేతికందిన దాన్ని తినడం వలన రోగాలు తప్పవు. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహారంలోకి బాక్టీరియా చేరుతుంది. అలాంటి ఆహారం తినడం వలన ఆ బాక్టీరియా శరీరంలోనికి చేరి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు హోటల్స్ ఆహారాన్ని తరువాత రోజుకు దాచి కస్టమర్లకు పెడుతుంటారు. ఇలాంటి నిల్వ ఆహారాన్ని మన పొట్ట సహించదు. ఇక బయట దొరికే ఆహారాలలో రుచికోసం కెమికల్స్ , క్రుత్రిమ పౌడర్లు కలపడం సాధారణం. ఇలాంటివి దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటితో పాటు కొందరికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు పడవు. అలాంటివి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థ బాగా ఇబ్బంది పడుతుంది.

పుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కనిపించే మొట్టమొదటి లక్షణం విరేచనాలు. సాధారణం కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా విరేచనాలు అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు విరేచనాలకు వాంతులు తోడవుతాయి. ఇలాంటి సమయంలో శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరగవచ్చు. తలనొప్పి, వికారం, జ్వరం, కాళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత నీటిని తీసుకున్నప్పుడు అతిసారం బారిన పడవచ్చు.
ఇక విరుద్ధ కాంబినేషన్ లు కూడా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని సేవించిన వెంటనే చల్లటి ఐస్ క్రీమ్ తినడం.., కొన్ని రకాల మాంసాహారాలతో కలిపి వెజ్ వంటలను తినడం వలన ప్రేగులులో విడుదలయ్యే రసాయినాలలో సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ ట్రబుల్ వంటివి కనిపిస్తాయి. తరచూ పుడ్ ఇన్ ఫెక్షన్ బారిన పడిన వారిలో దీర్ఘకాలపు రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ప్రమాదకరమైన రసాయినాలతో కలుషితమయిన ఆహారం తినడం వలన కంటి చూపు దెబ్బతినడం, కాళ్ళు చచ్చుబడిపోవడం లాంటి పరిణామాలు కూడా అరుదుగా చోటుచేసుకోవచ్చు.

పుడ్ ఇన్ ఫెక్షన్ రాకుండా ఉండటానికి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమయానికి తినడం.., పరిశుద్ధమైన నీటిని తాగడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అలాగే విరుద్ధ ఆహారాలను తినడం మానేయాలి. కొందరికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు శరీరానికి పడవు. అలాంటి వారు ఏ పుడ్ ఐటెమ్ లో అయినా తమకు పడని వస్తువు ఉందో గుర్తించి వాటిని దూరం పెట్టడం మంచిది. సాధారణంగా ఆహారం తీసుకున్న అయిదారు గంటల తరువాతే పుడ్ పాయిజినింగ్ అయ్యిందని గుర్తించగలం. అలాంటప్పుడు సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ ను వెంటనే సంప్రదించాలి.

భారతదేశంలో ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నది కలుషిత నీటిని తాగడం వలనే. అలాగే నగరాలలో ఎక్కువ మంది ఆఫీసుకు సెలవు పెట్టడానికి కారణం ఫుడ్ ఇన్ ఫెక్షనే. ఈవెనింగ్ పార్టీలలో ఇష్టమైన ఆహారాన్ని త్రుప్తిగా తినడం వరకు ఓ.కే. కానీ ఆ అహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారా. ఆహారం తయారీకి ఎలాంటి పదార్ధాలు ఉపయోగించారు అనేది మనమే గ్రహించాలి. పుడ్ పాయిజినింగ్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే శాతం తక్కువే. కానీ తరుచూ పుడ్ ఇన్ ఫెక్షన్ లకు గురయితే మాత్రం ఇబ్బందులు తప్పవు.

Leave a Comment