Eye Health : కంటి చూపు సమస్యల రాకుండా ఉండాలంటే ..?

By manavaradhi.com

Updated on:

Follow Us
Warning Signs of Eye Problems

సర్వేంద్రియానాం నయనం ప్రధానం… అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని చిన్న సమస్యలైతే, కొన్ని కంటి చూపును దెబ్బతీసేవీ ఉంటాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు. కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా కంటి సమస్యలను తెలుసుకోవచ్చు.

మానవ శరీరంలో ప్రధానమైన కళ్ళకు వచ్చే సమస్యలను కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించవచ్చు. ప్రారంభంలోనే గుర్తించగలిగి, పరీక్షలు చేయించుకుంటే సమస్య మరింత పెద్దది కాకుండా చూసుకోవచ్చు. చూపు బూజరుగా ఉండడం, కంటి నుంచి నీరుకాటం, కళ్ళు ఎర్రబడటం లాంటి సాధారణ కంటి సమస్యలు. వీటిలో ప్రతిది అంత ప్రమాద కరమైంది కాకపోయినా, ఇవి కంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పడానికి సూచనలు. అయితే వీటిని అన్ని సమయాల్లో గుర్తించడం వీలు కాదు. కంటిలో ఏ మాత్రం సమస్య ఉందని గుర్తించినా, వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దూరంగా ఉండేవి బూజరుగా కనిపించే ఈ సమస్య ఒక కంటికి లేదా రెండు కళ్ళకు రావచ్చు. దగ్గరగా పెట్టుకుని చదవడం ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇందులో తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. దీనికి కంటి అద్దాలు వాడి పరిష్కారం పొందవచ్చు.

వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలు చాలానే ఉన్నాయి. దూరంగా ఉండే అక్షరాలను చదవ గలరు గానీ, దగ్గరగా ఉండేవి చూడలేరు. 40 ఏళ్ళ తర్వాత ఇలాంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యకు రీడింగ్ గ్లాస్ లాంటి వాటితో పరిష్కారం పొందవచ్చు. కంటి ఉపరితలం అంతా కూడా రక్తనాళాలతో నిండి ఉంటుంది. కళ్లు చిరాకుకు గురైనా లేక ఇన్ఫెక్షన్ బారిన పడినా ఈ రక్త నాళాల పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబారినట్టు కనిపిస్తాయి. తగినంత నిద్ర లేకపోవడం, అలెర్జీలు, గాయాలకు గురైనా ఇలా జరుగుతుంది. కంజెంక్టివైటిస్ అనే మరో సమస్య వల్ల కూడా కళ్లు ఎర్రగా మారిపోవచ్చు. సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా ఏళ్ల పాటు గురైన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే సమస్య ఏంటన్నది నిర్ధారించుకునేందుకు వైద్యుల సాయం తీసుకోవడం మంచిది.

కంట్లో నీటి పరిమాణం తగ్గిపోవడం ఒక సమస్య అయితే, పెరిగిపోవడం కూడా సమస్యే. కాంతి, గాలి లేదా ఉష్ణోగ్రత విషయంలో సెన్సిటివ్ గా ఉండే వారిలో అధికంగా నీరు కారడం కనిపిస్తుంది. అందుకే బయటి అంశాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

నేటి ఆధునిక యుగంలో 40 ఏళ్ల వయసులోనే కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. అయితే గతంలో 80 ఏళ్ళ వయసులో వచ్చే సమస్య కాటరాక్ట్స్. ఈ సమస్య మొదలయ్యే ముందు సరిగా చదవలేకపోవడం, డ్రైవింగ్ లో సమస్యలు, రాత్రిళ్ళు సరిగా చూడ లేకపోవడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. డయాబెటిస్ సమస్యలు, పొగ తాగే అలవాటు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి శస్త్ర చికిత్సే పరిష్కారం. కంటి వెనుక భాగంలో అతి పల్చని పొరే రెటీనా. ఇది కణాల కలయికతో ఉంటుంది. కంటి ముందున్న దృశ్యాలను గ్రహించి వాటిని మెదడుకు పంపిస్తుంది. రెటీనాలో సమస్య ఏదైనా ఈ వ్యవస్థకు విఘాతం కలుగుతుంది. వయసు కారణంగా ఏర్పడే మాక్యులర్ డీజనరేషన్ తో రెటీనా కొంత భాగం క్షీణిస్తుంది. డయాబెటిక్ రెటినోపతితో రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను దెబ్బతీయడం మరో కారణం.

తొలినాళ్లలో అయితే సమస్యను గుర్తిస్తే దాన్ని నియంత్రించి చూపును కాపాడొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగిస్తుంటుంది. ఇది సహజం. మాక్యులర్ డీజనరేషన్, గ్లకోమా, క్యాటరాక్ట్ కారణంగా చూపులో సమస్యలు ఏర్పడతాయి. ఈ వయసులో చూపు మందగించడం సహజమే కదా అని ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఉన్న కొద్ది చూపును కూడా కోల్పోవాల్సి రావచ్చు. చలువ కళ్ళద్దాలు వాడడం, కంటికి ఎక్కువగా ఎండ తగలనివ్వక పోవడం, కళ్ళలో దుమ్ము లాంటివి పడకుండా చూసుకోవడం, రోజూ చల్లని నీటితో కంటిని శుభ్రపరచుకోవడం లాంటివి చేస్తుండాలి. వీటితో పాటు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ప్రారంభంలో గుర్తించి పరిష్కారాన్ని పొందవచ్చు.

కంటి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా, కంటి సమస్యలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు. తద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment