ఉరుకుల పరుగుల బిజీ యుగంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి కారణాలతోపాటు జన్యు పరమైన మార్పులు, అనారోగ్య సమస్యలతో తలనొప్పి రావడం సర్వ సాధారణమైపోయింది. కారణాలేమున్నా తలనొప్పి వచ్చిందంటే దాన్ని వెంటనే తగ్గించుకునేందుకు జాగ్రత్త పడాలి. లేదంటే కొన్ని రకాల తలనొప్పులు ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది.
తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నప్పుడు దానికి కారణమేంటనేది వెతకటం కష్టం. కానీ తగ్గిన తర్వాత ఎప్పుడెప్పుడు తలనొప్పి వస్తోంది? ఎప్పుడు ఎక్కువవుతోంది? అని ఆలోచిస్తే కారణాన్ని గుర్తించే అవకాశం లేకపోలేదు. చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం, ఆహార అలవాట్ల వంటి వాటిపైనా దృష్టి పెట్టి పరిశీలించాల్సి ఉంటుంది. తలనొప్పిలో తరచుగా కనబడేవి సైనస్, టెన్షన్, మైగ్రెయిన్ రకాలు. ముక్కు చుట్టుపక్కలుండే గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి తలెత్తితే సైనస్ తలనొప్పి వస్తుంది.
తల, మెడలోని కండరాలు బిగుతుగా అవటం టెన్షన్ తలనొప్పికి దారితీస్తుంది. ఇక మెదడులో తలెత్తే రసాయనాల మార్పుల మూలంగా నాడుల చివర్లు అతి సున్నితంగా తయారుకావటం వల్ల మైగ్రెయిన్ వస్తుంది. మీరు మీ ముఖం దగ్గరగా ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించినప్పుడు తలనొప్పి రావచ్చు. ఒక్కొక్కసారి చాలా సేపు ఏమి తినకుండా ఉండడం వల్లకూడా తలనొప్పి రావచ్చు. ఏమి తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.. ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది.
చాలా మంది మార్నింగ్ కాఫీ తాగలేదు కదా అని … రాత్రికి చాలా మెుత్తంలో త్రాగుతారు దీని వల్ల కూడా మీకు తలనొప్పి రావచ్చు. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల కూడా మరి కొందరిలో తలనొప్పి రావచ్చు. దీన్ని “బ్రెయిన్ ఫ్రీజ్” అని పిలుస్తారు. చల్లని పదార్థాలు, అతి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.
తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి ?
తలనొప్పి రావడానికిక చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇతర జీవన విధానం కావచ్చు తలనొప్పిని పెంచి పోషిస్తూ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలలో ఈ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. నిజానికి క్లష్టర్ తలనొప్పి స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పార్శ్వపు తలనొప్పి ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. దీనికి ఆయా వ్యక్తుల అలవాట్లు, జీవన విధానాలే కారణం. ప్రతి రోజు ఒకటే సమయంలో వచ్చే ఈ తరహా తలనొప్పులను తగ్గించుకునేందుకు వైద్య విధానాలతో పాటు, జీవన విధానంలో మార్పులు కూడా ఎంతో ఉపకరిస్తాయి.
పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ తెరను చూడడంవంటి అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి వెంటనే మెడిసిన్‌ను వాడకూడదు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. మద్యం బాగా సేవించే వారికి కూడా తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు మద్యానికి దూరంగా ఉండాలి.
తలనొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఎక్కువ సమయం అలాగే కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. యాంటీ గ్లేర్ స్ర్ర్కీన్ ఫిక్స్ సేఫ్ గార్డ్ చేయించుకోవడం వల్ల తలనొప్పిని అవాయిడ్ చేయొచ్చు. మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది . కాబట్టి కనీసం 7-8గంటల సమయం నిద్రపోవాలి. దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్ గా ఉండి ఏపనిచేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు.
కొందరిలో ఒత్తిడి వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. అందువల్ల దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తలనొప్పితో భాదపడేవారు మందులతో పాటు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం, ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం, యోగా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే తలనొప్పి ఎగిరిపోతుంది. దీంతో రిలాక్స్‌గా ఫీలవుతారు. తరచూ తలనొప్పి వస్తుంటే మాత్రం వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం ఉత్తమం.
తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం అన్నిరకాలుగా శ్రేయస్కరం.