Health tips:మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇళ్లు, ఇంట్లో పరిశుభ్రత కూడా ముఖ్యం

By manavaradhi.com

Published on:

Follow Us
Tips for Keeping Your Home Healthy

మన ఆరోగ్యం మన ఇల్లు … ఇంటి లోని వస్తువుల శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో… మనమూ అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉద్యోగం, వ్యాపారం అంటూ ఇంటిపై దృష్టి సారించకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం.

ఇంటి శుభ్రత ఇంట్లోని మనుషుల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అందులో నివసించే వారూ అంతే ఆరోగ్యంగా ఉంటారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. ఏది ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. అనే అంశంపైనే శుభ్రత ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. వ్యక్తిగత శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. అదే ఇంటి శుభ్రత కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది.

కొంతమంది దేనినైనా సరే వారానికోసారి సెలవు రోజుల్లో చేద్దామని నిర్లక్ష్యంగా వదిలేస్తారు.. అది సరికాదు. అన్ని వస్తువులూ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం లేకపోయినా..? కొన్ని వస్తువుల్ని మాత్రం ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. మీ ఫ్లోర్స్ క్లీన్ గా ఉండవచ్చు. అలమారాల్లో న్యూస్ పేపర్లూ, ఉత్తరాలూ, పాంప్లెట్లు, శుభలేఖలు, వంటివి పేరుకుపోయి ఉంటే చూడడానికి అంత బావుండదు. కాబట్టి వీటన్నింటికీ ఒక ప్లేస్ కేటాయించి ఎప్పటికప్పుడు వాటిని ఆ ప్లేస్ లో పెట్టేస్తూ ఉంటే సరిపోతుంది.

చాలామంది వారానికోసారి దుమ్ము దులుపుదామని అనుకుంటారు. కానీ దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపారు వంటివి ఉపయోగించడానికి అసహ్యం అనిపిస్తాయి. అంతేకాదు దానిపై చేరిన దుమ్ము అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపడం చాలా అవసరం. బెడ్స్‌ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. బెడ్‌షీట్‌ దులపటం, ముడతలు లేకుండా చేయటం, తలగడలు సరి చేయటం, రాత్రివేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టడం వంటివి తప్పకుండా చేయాలి. రాత్రి పడుకునే సమయంలో శుభ్రపరచిన బెడ్‌ పై పడుకోవటం మానసికంగానూ, శారీరకంగానూ ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది.ఆశ్చర్యంగా అనిపించొచ్చుగానీ ఇల్లు శుభ్రంగా లేకపోవటం కూడా కొందరిలో ఒత్తిడికి కారణమవుతోంది.

ఇంటిలోని వస్తువులు సరిగా లేకుండా … ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంటే మీరు చేసే పనులపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది. అలా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మీ మెదడు పనితీరు మీద దాని ప్రభావం పడుతుందని పరిశోధకులు కనుగోన్నారు. ఎవరైతే తమ గృహాలను చాలా వస్తువులతో నింపుతారో వారికి హోర్డింగ్ డిజార్డర్ కలిగి ఉండవచ్చు. అతిగా తినడం మరియు ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంది. హోర్డింగ్ డిజార్డర్ ఉన్నవారికి నిద్రలేమి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇల్లంతా దుస్తులు, బొమ్మలు, ఆటవస్తువులతో చిందరవందరగా ఉన్నా… చిన్నగానూ అనిపిస్తుంది. ఎక్కడి వస్తువులను అక్కడ చక్కగా సర్దేస్తే బాగుంటుంది.

ఏది ఏమైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా లేకపోతే హాయిగా ఉండదు. ఎదో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందు చిందరవందరగా కనిపించే వస్తువులని అన్ని కూడా సర్దేయండి. లేకుంటే మీ ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ ఇది క్లియర్ చేసేయండి. తీసిన వస్తువుని తీసిన చోట పెడితే అందంగా ఉంటుంది గది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంటిని అందంగా సర్దుకునే మహిళల్లో మానసిక ఒత్తిడిని ప్రేరేపించే ‘కార్టిజోల్‌’ అనే హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు వెల్లడించారు.

ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇల్లు శుభ్రంగా, కాస్త పద్ధతిగా ఉంచుకోవటమన్నది మానసిక ప్రశాంతతకు దోహదం చేసే అంశమని మరువద్దు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అందంగా ఉంచుకోవడం చెయ్యాలి. పాత దుస్తులు, పనికిరాని వస్తువులను ఎక్కువగా పెట్టుకుంటే చిరాకు పెరిగిపోతుంది. ఇంటి అందాన్ని దెబ్బతీయడంతో పాటు బొద్దింకలు, దోమలకు ఆవాసాలుగా మారి లేనిపోని రోగాలు కూడా వ్యాపిస్తాయి.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇళ్లు, ఇంట్లోని పరిశుభ్రత కూడా ముఖ్యమైనదేనని తెల్సుకోవాలి. దానికనుగుణంగా ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment