Health Tips – దుమ్ము, ధూళి వల్ల వచ్చే వ్యాధులు

By manavaradhi.com

Published on:

Follow Us

వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్ లు మనకు రకరకాల వ్యాధులు కలిగిస్తాయి.. వీటివల్ల మనల్ని రకరకాల జబ్బులు వెంబడిస్తాయి. అసలు ఈ దుమ్ము, ధూళితో వెనుక పొంచి ఉన్న ప్రమాదాలు ఏంటి? వాటి నుంచి ఎలా బాయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా , వైరస్‌లతో పాటు ఫంగస్‌ , దుమ్ము , ధూళి , పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటితోపాటు పరిశ్రమలు విడిచే రసాయన వాయువులు కూడా గాలిని విపరీతంగా కాలుష్యం చేస్తున్నాయి. వీటి వల్ల మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ మనం దుమ్ము, ధూళిని చాలా తేలిగ్గా తీసిపారేస్తాం. దుమ్ము ఉన్న వాతావరణంలో తిరగాల్సి వచ్చినా పెద్దగా పట్టించుకోకుండా అలాగే వెళ్తుంటాం. దీంతో వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లు, ఊపిరితిత్తులపైన ఈ కాలుష్య ప్రభావం విపరీతంగా ఉంటుంది.

దుమ్ము, ధూళి వాతావరణంలో ఎక్కువసేపు గడిపితే కళ్లలో మంటలు చెలరేగే అవకాశం ఉంది. కళ్లు దురదగా ఉండడం, ఎర్రబారడం, నీరు కారడం జరుగుతుంది. ఎక్కువ సేపు దుమ్ము ఉన్న వాతావరణంలో గడపాల్సి వస్తే కచ్చితంగా అద్దాలు ధరించాలి. బైక్ పై వెళ్లిన సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కళ్లు దురద పెట్టినప్పుడు వెంటనే మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. తద్వారా ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంది. కొందరికి విపరీతంగా దగ్గు వచ్చి.. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది. దుమ్ము,ధూళి కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ముందుగా అలర్జీ వస్తుంది. ముక్కు దిబ్బడ, నీరు కారడం జరుగుతుంది. ఇది సైససైటిస్‌కు దారి తీస్తే .. తలనొప్పిగా ఉండడం, ముక్కులో గడ్డలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. బ్రాంకెటైటిస్, ల్యారింజైటిస్‌కు గురై ఊపిరితిత్తుల్లో పేరుకుపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. అందుకనే బయట ఎక్కువగా తిరిగేవాళ్లు తప్పనిసరిగా ముక్కుకు మాస్కులు ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల్లో తిరగకపోవడమే మంచిది. వీరు డస్ట్ ఎలర్జీకి త్వరగా ప్రభావితమ్యయే అవకాశం ఉంది.

రోజురోజుకీ జనాభా పెరిగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యాల వల్ల రకరకాల రోగాలొస్తున్నాయి. కాటన్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాల్లకి బైసినోసిస్‌ , షుగర్‌కేర్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకి బాగాసోసిస్‌ , యాస్బెస్టాస్‌ కంపెనీలో పనిచేసే వాళ్లకి యాస్టెస్టోసిస్‌ అనారోగ్యాలు కలుగుతాయి. ఇలాంటి వృత్తుల్లో పనిచేసేవాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.

వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళి కణాలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. కేవలం దుమ్మే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. డస్ట్ లో దాగి ఉన్న సూక్ష్మ కణాలు మన ఉనికినే దెబ్బ తీస్తాయి.

Leave a Comment