ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు చిరంజీవి, తేజా సజ్జా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్ట్ మూలంగా తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఆయన రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని అన్నారు.
ఈ అద్భుతమైన కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా బిడ్డ లాంటి తేజ సజ్జాకు కూడా థాంక్యూ. రక్తదానం అనే పేరు చెప్పగానే నేను (Chiranjeevi) గుర్తొస్తున్నానంటే అది నా పూర్వజన్మ పుణ్యం. ఈ సందర్భంగా మీతో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురుతిరిగింది. ‘చిరంజీవిని అన్నన్ని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఆ వీడియో చూసి ఆమె గురించి వివరాలు కనుక్కొన్నాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిపింది. ఆ మాటలు విని నా హృదయం ఉప్పొంగింది’’.
‘‘సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై ఎందుకు స్పందించరు అని అందరూ అడుగుతారు. నేనెప్పుడూ స్పందించను. ఎందుకంటే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మంచితనమే మాట్లాడుతుంది. ఇది సత్యం. ఆ మహిళ మాట్లాడిన తర్వాత సదరు రాజకీయ నాయకుడు ఎక్కడా నా గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది కదా. ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా.. ఇంటికి వెళ్లాక వాళ్ల భార్య అయినా మరోసారి ఇలా మాట్లాడొద్దు అని చెబుతుంది’’ అని చెప్పారు.
‘‘మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే సమాధానం చెబుతుంది. అందుకే నేను ఎప్పుడూ దేనికీ స్పందించను. అంత అవసరం కూడా నాకు లేదు. మంచి చేసుకుంటూ వెళ్తాను. నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను. ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా నా మాటను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేస్తున్నారు. నా పేరును మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్లందరికీ అభినందనలు’’ అని చిరంజీవి తెలిపారు.