కొంచెం ఎక్కువ ఆహారం తీసుకొన్నప్పుడో.. పులుపు, మసాల ఆహారాలు తిన్నప్పుడో కొన్నిసార్లు మనం పొట్ట ఉబ్బరంతో బాధపడుతుంటాం. పొట్ట ఉబ్బరం సాధారణంగా కడుపులో తయారయ్యే గ్యాసెస్ కారణంగా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి పొట్ట ఉబ్బరం రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? పొట్ట ఉబ్బరం నివారణకు ఏంచేయాలి..?
మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనది. గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే సమస్య. ప్రస్తు కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తుందని నిపుణులు సెలవిస్తున్నారు. కొన్ని అలవాట్లు, లైఫ్ స్టైల్ లో మార్పులు, డైట్ ప్లాన్ తో.. పొట్ట ఉబ్బరం తగ్గించడం తేలికైన పనే. కడుపు ఉబ్బరం అనేది కడుపు నొప్పితో కూడి ఉంటుంది. అంతేకాక కడుపు నిండిన భావన ఉంటుంది. కడుపు ఉబ్బరం చికాకుపెట్టే పేగు వ్యాధికి కారణమవుతుంది.
పొట్ట ఉబ్బరానికి పేగులలో గ్యాస్, మలబద్దకం, తినేటప్పుడు గాలి లోపలికి వెళ్లడం, కొన్నిరకాల ఆహారాల, బోవెల్ సిండ్రోమ్ వల్ల కూడా పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. డయేరియా, పొట్టలో సమస్యలు, పొట్ట నొప్పి వంటి అరోగ్య సమస్యల వల్ల పొట్ట ఉబ్బరం ఎదురవుతుంది. ముందుగా మనం తీసుకొనే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కారం, మసాలాలు, ఉప్పు అధికంగా ఆహారాలను దూరం పెట్టాలి. కార్పొహైడ్రేట్లు, కృత్రిమ చక్కెరలు ఒకేసారి తీసుకోవద్దు. బుడగలువచ్చే పానీయాలు, సోడాలను తీసుకోవడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ ఉబ్బరం లోపాలను తగ్గిస్తుంది.
కడుపు ఉబ్బరంగా ఉండటానికి ప్రధాన కారణం మలబద్దకం, నిత్యం సరైన సమయానికి మలవిసర్జన అలవాటుచేసుకోవాలి. పాలు, పాలపదార్థాల కారణంగా కూడా కడుపులో గ్యాస్ తయారవుతుంది. అందుకని ఐస్‌క్రీములు, ఇతర కృత్రిమ చక్కెరలతో చేసే పదార్థాలను తినకుండా చూసుకోవాలి. వాకింగ్, శారీరక శ్రమ కడుపు లోపల నిల్వ ఉన్న వాయువులను విడుదల చేయటానికి సహాయపడుతాయి. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించగానే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. చల్లగా ఉండే ఆహారాలు, ఫ్రిజులో దాచిన పదార్థాలను తినకుండా చూసుకోవాలి.
సరైన వేళకు ఆహారం తీసుకొనే అలవాటు ద్వారా కడుపు ఉబ్బరం సమస్య రాకుండా చూసుకోవచ్చు. అలాగే తీసుకొనే ఆహారంలో శరీరం ఆరోగ్యానికి పనికివచ్చే పదార్థాలు ఉండేలా చూసుకొంటే చాలా మంచిది. కడుపు ఉబ్బరం ఎక్కువకాలం పాటు వేధిస్తుంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.