విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు.
వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏటా రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్.. ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్ గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్, గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఉపయోగపనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులో కి రానున్నాయి.









