Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది.
ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్యనాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన 96.5 మిలియన్ డాలర్ల వేతనం అందుకోనున్నారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.846 కోట్లు అన్నమాట. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 79.1 మిలియన్ డాలర్ల (రూ.664 కోట్లు)తో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ.
జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) వృద్ధిలో దూసుకెళ్లింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 23 శాతం లాభపడ్డాయి. మైక్రోసాఫ్ట్‌లో అందించిన సేవలకు గానూ సత్యనాదెళ్లకు 9.5 మిలియన్ డాలర్లు (రూ.80 కోట్లు) నగదు ప్రోత్సాహకం అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్ తెలిపింది. కృత్రిమ మేధ రేసులో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతి నేపథ్యంలో కంపెనీ బోర్డు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. సత్యనాదెళ్ల, ఆయన నాయకత్వ బృందం కృషి వల్ల కృత్రిమ మేధ రంగంలో మైక్రోసాఫ్ట్ మరింత ముందుకువెళ్లిందని సంస్థ బోర్డు పేర్కొంది.









