Alampuram Jogulamba – అలంపురం జోగులాంబ నిజరూప దర్శనం

By manavaradhi.com

Published on:

Follow Us
Alampuram Jogulamba

అష్టాదశ శక్తిపీఠాలలో అయిదోది అలంపురం జోగుళాంబ. సతీదేవి పైవరుస దంతాలు పడిన చోటు అలంపురం. జోగుళాంబ అంటే యోగులకు, భిక్షువులకు అమ్మ. అలంపురం నవబ్రహ్మలకు నిలయం. ఈ క్షేత్రంలో శంకరుడు బాలుని రూపంలో బ్రహ్మదేవునికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ బాలఈశ్వరుని దర్శించి, శివ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందంటారు. ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలలో కన్పించేవన్నీ శివలింగాలే. ఈ క్షేత్రానికి గతంలో హలంపురం, హేమలాపురం వంటి పేర్లుండేవి. 566 – 757 సంవత్సరాల మధ్య బాదామి చాళుక్యుల కాలంలో ఇక్కడి నవబ్రహ్మాలయాలు నిర్మితమయ్యాయని చరిత్ర చెబుతోంది. వారి తరువాత రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి కృషిచేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమప్రదేశంలో తుంగభద్ర ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కారణంగా అలంపురం క్షేత్రాన్ని దక్షిణకాశి అని పిలుస్తారు. కాశీలో వలెనే అలంపురం లో కూడా తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక వంటి 64 ఘట్టాలున్నాయి.

అలంపురం క్షేత్రంలో ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ సప్తమి వరకు కొనసాగుతాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మ వారికి పంచామృతాభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి. మాఘ శుద్ధ పంచమి పర్వదినాన జోగుళాంబ అమ్మవారిని కొలిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయి. అలంపురంలో అమ్మవారి భీకరరూపాన్ని శాంతింపచేసి సంవత్సరమంతా సాధురూపంలో దర్శనం కలిగిస్తారు. వసంత పంచమి రోజున మాత్రం అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. అదేరోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Leave a Comment