మన హిందూ పురాణాలు అలాగే ఆచారాలు ప్రకారం ఆ మహేశ్వరుని దర్మపత్ని అయిన సతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. 51 శక్తి పీఠాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో తప్పకుండా ఉండే శక్తి పీఠం హింగ్లాజ్ దేవి. అందులో ఒకటి పాకిస్థాన్‌లో ఉన్న శక్తిపీఠం హింగ్లాజ్ దేవీ ఆలయం.
18 శక్తి పీఠాలు
లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యాం దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
మనలో చాలా మందికి తెలిసిన శక్తి పీఠాలు 18 అయితే మనం నిత్యం పఠించే లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతోంది… ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’అని. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని మన పురాణ గ్రంథాలో సైతం పరిశీలిస్తే 108 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు. అయితే, 51 శక్తి పీఠాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో తప్పకుండా ఉండే శక్తి పీఠం హింగ్లాజ్ దేవి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉందీ శక్తి పీఠం. పాకిస్థానీయులు ఈ ఆలయాన్ని నానీ మందిరంగా పిలుస్తారు.
శక్తి పీఠం హింగ్లాజ్ దేవి స్థల పురాణం
మనలో చాలా మందికి దక్ష యజ్ఞం గురించి బాగా తెలుసు.. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. లోక రక్షకుడైన ఆ పరమేశ్వరుడుని కైలాస పర్వతం వద్ద చూసి ఆయనను వివాహచేసుకోవాలనుకుంటుంది. ఆ పరమశివుడిని తన ప్రాణనాథుడిగా భావిస్తుంది. అయితే శివుడిని వివాహాం చేసుకోవడం దక్షుడుకి నచ్చదు. సతీదేవి తండ్రి మాటను కాదని, దేవదేవుడైన ఆ పరమేశ్వరుని వివాహమాడుతుంది. తనకు ఇష్టంలేని శివుని పెండ్లి చేసుకోవడంతో క్షుడు కోపంతో బృహస్పతియాగాన్ని తలపెడతాడు. ఇందుకు సకల దేవతలను ఆ యాగానికి ఆహ్వానిస్తాడు అయితే దానికి తన కూమారై అయిన సతీదేవిని కానీ పరమశివునికి గాని పిలవడు. కానీ పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి యాగానికి వెళ్ళాలనుకుంటుంది. తమకు పిలుపురాకుండా వెళ్లడం మంచిది కాదు అని ఎంత చెప్పని సతీదేవి వినకుండా పుట్టింటి వారు పిలవాలాఏంటి అని ప్రమధగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్తుంది. శివుడు అంటే ఇష్టంలేని దక్షుడు వారిని అవమానిస్తాడు. ఆ శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోతుంది. సతీదేవి మరణ వార్త విన్నమహేశ్వరుడు కోపంతో ఊగిపోతు… తన ప్రమధ గణాలతో కలిసి శివ తాండవం చేస్తూ దక్షయజ్ఞాన్ని భగ్నం చేస్తాడు. కానీ, సతీ వియోగ దుఃఖంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని జగద్రక్షణ కార్యాన్ని మానేస్తాడు. దీంతో దేవతలు వెళ్లి, విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. దేవతల ప్రార్థన మన్నించిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ఆ ప్రదేశాలే శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన క్షేత్రాలు అయ్యాయి. వాటిలో శిరో భాగం ‘బ్రహ్మ రంధ్రం’ హింగోళమనే ప్రదేశంలో పడింది. అదే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠం హింగ్లాజ్ దేవి ఆలయం. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
ఇప్పుడు ఆప్రదేశం పాకిస్థాన్ లో ఉందికానీ నిజానికి వేదకాలం నుంచి ఆ ప్రాంతమంతా భారత దేశంలో అంతర్భాగం. పాకిస్థాన్ ఏర్పడకు ముందు అక్కడ కూడా హిందూమతం దేదీప్యమానంగా వెలిగింది. ఎన్నో హిందూ ఆలయాలు అక్కడ ఉన్నాయి. దేశ విభజన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోయారు. అయినా, ఇప్పటికీ పలు హిందూ ఆలయాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. వాటిలో హింగ్లాజ్ దేవి ఆలయం ఒకటి. హింగ్లాజ్ దేవిని ముస్లింలు బీబీ నానీగా పిలుస్తారు. పలువురు ముస్లింలు హింగ్లాజ్ దేవిని పూజిస్తారు కూడా. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్యలో హింగ్లాజ్ దేవి ఆలయం ఉంది. కరాచీ నుంచి 250కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే ఆలయానికి చేరుకోవాలి.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో హింగ్లాజ్ దేవి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు హింగ్లాజ్ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కు బడులు చెల్లించుకుంటారు. స్థానిక ముస్లింలు ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు. ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రవహించే హింగ్లోజ్ నదిలో స్నానమాచరించి దేవిని దర్శించుకుంటారు. హింగ్లాజ్ దేవిని దర్శించుకున్న తర్వాత భక్తులు అక్కడి సమీపంలో ఉన్న చంద్రగప్, కందేవారీ అనే బురదతో కూడిన అగ్నిపర్వతంపైకి వెళ్తారు. ఆ బురదలో పూలు చల్లి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరి కాయలను అందులో ముంచుతారు. బురద అంటిన ఆ కొబ్బరి కాయలను ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని మరికొందరి నమ్మకం. కొందరు ఆ బురదను శరీరానికి పూసుకుంటారు. మరి కొందరు ఆ బురదతో చిన్న ఇళ్లు కడతారు. అలా చేస్తే వారి సొంత ఇంటి కల నిజమవుతుందని విశ్వాసం.