‘‘చంద్రహోసోజ్వలకరా శార్దూలవరహాహనా కాత్యాయనీ శుభం ద్యాద్ధేవి దానవఘాతినీ’’
Navratri Day 4: విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. నాల్గోవ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.. శక్తి సాధనకు ప్రతీక అయిన కాత్యాయని దేవి పూజిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దుర్గాదేవి నవ దుర్గలుగా అవతరించిందని విశ్వాసం. ఈ నవ దుర్గలలో ఆరవ అవతారమే కాత్యాయని అవతారంగా చెబుతారు.. వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షికి సంతానం కలగకపోగా.. దుర్గా దేవి భక్తుడైన ఆయన.. సంతానం కోసం ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారే తనకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నాడట.. దీంతో అమ్మవారు అంగీకరించిందని పురాణాలు చెబుతున్నాయి.. కాత్యాయన మహర్షి కిరణాల రూపంలోని త్రిమూర్తుల శక్తులకు తన తపః ప్రభావంతో ఒక స్త్రీ రూపాన్ని ఇస్తాడు. ఈ విధంగా కాత్యాయన మహర్షి వరం కూడా సార్ధకమవుతుంది. త్రిమూర్తుల శక్తుల అంశతో దుర్గాదేవి కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మిస్తుంది. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఆమె కాత్యాయనిగా పిలువబడిందని చెబుతారు.
దసరామహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ పదకొండు అలంకారాల్లో దర్శనమీయనుంది. తిథుల హెచ్చు తగ్గుల కారణంగా ఆశ్వయుజ శుద్ధ చవితి గురువారం రోజున అమ్మవారిని శ్రీకాత్యాయనీదేవిగా అలంకరిస్తారు. పూర్వం ‘కత’ అనే మహర్షికి దేవి ఉపాసనవల్ల ఒక కుమారుడు జన్మించాడు. అతడికి ‘కాత్య’ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగిన తరుణంలో తపశ్శక్తి సంపన్నుడు కావాలన్న కాంక్ష అతనిలో పెరిగింది. జగన్మాతనే పుత్రికగా పొందాలని తన కోరికను బయట పెట్టిన తరుణంలో అమ్మవారు కాత్యయునుడి పుత్రికగా జన్మించింది. దీంతో ఆమెకు కాత్యాయనిదేవి అని పేరువచ్చింది. మహిషాసురుని అంతమొందించిన తరువాత ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకళ్యాణం కావించారు. నాటి నుంచి కాత్యయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా చతుర్విధ పురుషార్థాలు భక్తులకు ప్రసాదించే వరప్రదాయనిగా వర్ధిల్లింది. తమ కోరికలు సిద్ధించేందుకు జగన్మాత ఆశీస్సుల కోసం మహిళలు ప్రత్యేకంగా కాత్యాయని వ్రతం ఆచరించడం కూడా జరుగుతుంది.








