మంచి ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యానికి చక్కని మార్గం. తగిన ఆహారమంటే సమతుల ఆహారం. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్ళలో దేహానికి లభించినప్పుడే పోషకాహారం తీసుకున్నట్టు లెక్క… సమయానికి ఆహారం, సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అన్ని వయసుల వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి.
ఆహారం ఏమేం తినాలి అనే దానితో పాటు ఏ విధంగా తినాలి అనే స్పష్టత కూడా ఉండాలి. తగినన్ని కూరగాయలు, పప్పుదినుసులను.. వివిధ రకాలైన ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సమతుల ఆహారం అందుతుంది. కొన్ని గింజలకే పరిమితం కాకుండా విభిన్న రకాలైన ధాన్యాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు. కేవలం అన్నమే కాకుండా అందుకు సరిసమానంగా కూరగాయలనూ తీసుకోవడం ద్వారా శరీరానికి సమతుల ఆహారం అందుతుంది.
సమయానికి మంచి ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణక్రియ పని విధానం మెరుగుపడటంతో పాటు శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఇలా సరైన ఆహారం తీసుకోవటం వల్ల బరువు పెరగటం, తగ్గటం అనేది ఉండదు. ఇలా చేయటం వల్ల శరీరం బరువు కూడా సమతులంగా ఉంటుంది. అలాగే మసాలా, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే సరిపోతుంది.
మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.
కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం. మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ప్యాక్ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.
తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది.
ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే నీరు తీసుకోవడం, తిన్న తర్వాత కాస్త దూరం నడవడం, నూనె, మసాలా, కారం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.
కాలానికనుగుణంగా మనం తీసుకోనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో ఒక మాదిరి, చలికాలంలో ఒక మాదిరి, వేసవికాలంలో ఒక మాదిరి కాయగూరలతో శరీరానికి సరిపడేట్లు తీసుకుంట్టుండాలి. ఇలా శరీర అవసరాలకు తగ్గట్టుగా, మారే వాతావరణానికి అనుగుణంగా తినడం శ్రేయస్కరం.