Protein Rich Foods:ఏ ప్రోటీన్లు మంచివి : శాకాహారమా ? మాంసాహారమా?

By manavaradhi.com

Published on:

Follow Us

ప్రొటీన్లు కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ వయసుని బట్టి, శరీరాన్ని బట్టి రోజుకు సరాసరిన 46 గ్రాముల ప్రొటీన్ పొందాలి. అదే విధంగా పురుషులకు 56 గ్రాముల ప్రొటీన్ అవసరాలు ఉంటాయి. మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఈ ప్రొటీన్ కాస్త తక్కువే అందాలి. అదే విధంగా రోజంతా మనం తీసుకునే ఆహారంలో కేలరీల కంటే ప్రొటీన్లు బాగా ఉండేలా చూసుకోవాలి. దీని మీద ఆధారపడే శరీరానికి ప్రొటీన్ అందించే ప్రయత్నం చేయాలి.

కార్బోహైడ్రేట్లూ, కొవ్వుని నిల్వ చేసుకున్నట్టుగా శరీరం ప్రొటీన్లు నిల్వ చేసుకోదు. దాంతో ఏ రోజుకారోజు మనం ప్రొటీన్‌ నిండిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలా తీసుకోకపోతే మన శరీరం మన కండరాల నుంచి వాడుకుంటుంది. అదే జరిగితే శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.

ప్రొటీన్లు మన శరీరంలో కండరాలకు, ఎముకలకు, చర్మానికి.. అన్నింటికీ కీలకమైన వనరు. ఒక రకంగా శరీర నిర్మాణానికి ఈ మాంసకృత్తులే మౌలికం. అందుకే మన శరీరంలో కణాల వృద్ధికి.. అంటే శారీరక ఎదుగుదలకూ, అలాగే ఒంట్లో నిరంతరం జరుగుతుండే మరమ్మతులకు.. రెంటికీ కూడా మాంసకృత్తులే మౌలిక అవసరం. శారీరక దృఢత్వం, సామర్థ్యం బాగుండేందుకు ప్రొటీన్లు తప్పనిసరి. అలాగే జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ సజావుగా పని చేసేందుకు కూడా ఈ ప్రొటీన్లు అవసరం.

  • ప్రొటీన్లు జంతు సంబంధ ఆహార పదార్థాలైన పాలు, గుడ్లు, మాంసం, చేపల ద్వారా దండిగా లభిస్తాయి.
  • ఇక వృక్ష సంబంధ శాకాహార పదార్థాల్లో రకరకాల పప్పులు, చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో జంతు సంబంధ పదార్థాల నుంచి వచ్చే మాంసకృత్తులు నాణ్యంగా ఉంటాయి, చక్కగా ఒంటబడతాయి కూడా.
  • మన శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలన్నీ జంతు సంబంధ మాంసకృత్తుల్లో దండిగా, అదీ సరైన పాళ్లలో లభిస్తుండటమే దీనికి కారణం. శాకాహార పదార్థాల నుంచి ఇంత సమృద్ధిగా లభించవనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో కొన్నికొన్ని అమైనో ఆమ్లాల స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి.
  • అలాగని శాకాహారులు తమకు మాంసకృత్తులు లభించవని అపోహ పడాల్సిన పనేం లేదు. నిత్యం తమ ఆహారంలో- కంది, శెనగ వంటి పప్పులు.. బియ్యం, గోధుమ వంటి తృణధాన్యాలు.. సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవటం ద్వారా అన్ని రకాల అమైనో ఆమ్లాలనూ పొందొచ్చు, వీటి ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృత్తులన్నీ చాలా వరకూ లభిస్తాయి.
  • కాకపోతే శాకాహారులు ఇందుకోసం కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి.

శాకాహార పదార్థాల్లో మాంసకృత్తులు ఉండవని కాదు. ఉంటాయిగానీ నాణ్యంగా అధిక మొత్తాల్లో ఉండవు. ఉదాహరణకు పండ్లలోనూ, గుడ్లలోనూ రెంటిలోనూ మాంసకృత్తులు ఉంటాయిగానీ మన శరీరం గుడ్ల నుంచి గ్రహించినంత సులభంగా, ఎక్కువగా పండ్ల నుంచి మాంసకృత్తులను గ్రహించలేదు. అందుకని శాకాహార పదార్థాల్లో వేటిలో మాంసకృత్తులు దండిగా ఉంటాయో గుర్తించి.. రోజూ ఆహారంలో అది ఒక్కటన్నా తప్పకుండా చూసుకోవటం మంచిది.

  • కంది, పెసర, మినుము, శెనగ, వేరుశెనగ, బఠాణీ వంటి పప్పుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవచ్చు.
  • ప్రతి పూటా ఆహారంలో ఇలాంటివి ఏదో ఒకటి, అదీ మొత్తం ఆహారంలో కనీసం నాలుగో వంతైనా ఉండేలా చూసుకోవటం అవసరం. మంచిది కదా అని మరీ ఎక్కువగా ప్రోటీను పదార్థాలే తినటం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ. వీటిని అవసరానికి మించి అతిగా తింటే కిడ్నీల మీద భారం ఎక్కువగా పడుతుంది.
  • ఒకవేళ ఎవరైనా కావాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంటే కిడ్నీల మీద భారం పడకుండా ఉండేందుకు నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండాలి.
  • ఏ రకం ఆహారమైనా అవసరానికి మించి తింటే ఆ మిగిలిన శక్తి అంతా కొవ్వు రూపంలో ఒంట్లో చేరి, బరువు పెరిగిపోతారు.
  • కాబట్టి అతిగా అదే తినక్కర్లేదుగానీ అవసరమైనంత ఉండేలా చూసుకోవటం మాత్రం చాలా అవసరం.

Leave a Comment