Stomach Pain : కడుపు నొప్పిలో రకాలు ఏమిటి..? ఏవేవి ప్రమాదం..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Abdominal Pain Types, Symptoms, Treatment, Causes, Relief

తినడంలో ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే చాలు… మన పొట్ట చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిలో కడుపు నొప్పి కూడా ఒకటి. ఒక్కోసారి వంటింటి వైద్యంతో సరిపెట్టుకున్నా, కొన్ని మార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందులో ఎడమవైపు పొత్తికడుపులో వచ్చే నొప్పి ఒకటి.

కడుపు నొప్పి వచ్చిందంటే చాలు… కొందరు అసలు పట్టించుకోరు. ఇంకొందరు విపరీతంగా భయపడిపోయి, సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో ఎడమవైపు పొత్తికడుపులో మొదలయ్యే నొప్పి కూడా ఒకటి. దీనికి సంబంధించి ఎన్నో ప్రాథమిక అంచనాలు ఉన్నా, అది అన్ని సమయాల్లో మంచిది కాదు. నొప్పిని తేలిగ్గా తీసుకోకుండా, వైద్యసలహా తీసుకోవడమే మేలు. అసలీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ప్రమాదకరమైన కడుపునొప్పిని గుర్తించేదెలా, దీనికి నివారణా మార్గాలేంటి… ?

జీర్ణ వ్యవస్థలో తలెత్తే ఇబ్బందులు కడుపు నొప్పికి కారణం అవుతాయి. కడుపు నొప్పి గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప మనకు విషయం అవగతం కాదు. విరోచనాలు అయ్యేటప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, మనకు సరిపడని పదార్థాలు తిన్నప్పుడు కడుపు నొప్పి మొదలౌతుంది. శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి పని చేసినప్పుడు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు ఇది దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది.


కడుపునొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావటంగా చెబుతారు. కొన్నిసార్లు నొప్పి వచ్చిన చోటనే ఉండిపోవచ్చు. మరికొన్ని సార్లు ఈ నొప్పి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించవచ్చు. నొప్పి ఎటువైపు నుంచి ఎటు వైపుకి వెళుతోంది అన్నది కూడా ముఖ్యమే. వాస్తవానికి మానవ జీర్ణ వ్యవస్థలో అనేక భాగాలు ఉన్నాయి. కడుపు మధ్య భాగంలో నొప్పి మొదలై, కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే ’అపెండిక్స్’ నొప్పిగా….. ఎడమ వైపు కింది భాగంలో నొప్పి మొదలై కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే పేగు నొప్పి అని… పొట్ట మధ్యలో నొప్పి మొదలై కుడి దిశగా పైకి వ్యాపిస్తుంటే పిత్తాశయ నొప్పి అని చెబుతారు. ఈ అంచనా ప్రాథమికమైనది మాత్రమే. సరిగ్గా నిర్ధారణ కావాలంటే మాత్రం డయాగ్నస్టిక్‌ టెస్టులు తప్పనిసరి. వ్యాధి తీవ్రం అవుతోందని భావిస్తే మాత్రం నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎడమవైపు పొత్తి కడుపులో వచ్చే నొప్పి విషయానికి వస్తే, ఇది జీర్ణవాహిక మీద ఆధారపడి ఉంటుంది. ఈ నొప్పి జీర్ణవాహిక మీదే కాదు చర్మ సమస్యలు, పునరుత్పత్తి అవయవాల సమస్యలు, మూత్రనాళాల సమస్యల మీద కూడా ఆధారపడి ఉంటుంది. పరిస్థితిని బట్టి, కారణాన్ని బట్టి ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉండవచ్చు. అండాశయం, మూత్రపిండాలు, సిగ్మాయిడ్ కొలన్ ఎడమ మూత్రపిండం, ఎడమ స్పెర్మాటిక్ కార్డ్, గర్భాశయం మరియు పిత్తాశయానికి సంబంధించిన సమస్యలు ఈ నొప్పికి ప్రధాన కారణం అవుతాయి. ఇందులో మొదటిది ఎడమ ప్రేగు గోడలు ఒక గుబ్బ లాంటిది తయారు కావడం. ఎక్కువ మంది దీనివల్లే ఎడమవైపు పొత్తి కడుపు నొప్పి ఎదుర్కొంటూ ఉంటారు. క్రమంగా లేదా హఠాత్తుగా నొప్పి రావడం, పొత్తి కడుపు ప్రాంతంలో వాపు, విరేచనాల్లో రక్తం కనిపించడం లాంటి వాటి ద్వారా ఈ తరహా నొప్పిని గుర్తించవచ్చు.

ఒక్కోసారి మలబద్ధకం కూడా ఈ నొప్పికి కారణం అవుతుంది. కేకులు, మాంసం, పొడి ఆహారం, తక్కువ ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి కడుపునొప్పి మొదలౌతుంది. అయితే ఎప్పుడూ ఇదే కారణం కానవసరం లేదు. అదే విధంగా మూత్రనాళంలో తలెత్తే సమస్యలు కూడా పొత్తి కడుపు నొప్పికి కారణం అవుతాయి. మూత్రపిండాలు, మూత్రాశయాలకు సూక్ష్మ జీవుల వల్ల అంటు వ్యాధులు సోకి, విసర్జనా క్రియ ప్రభావితం అయినప్పుడు నొప్పి కలుగుతుంది. మూత్రాశయం మీద బ్యాక్టీరియా సంక్రమించడం వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. మూత్ర విసర్జన సమయంలో పొత్తి కడుపులో అసౌకర్యం, వెంటవెంటనే వెళ్ళాలని అనిపించడం, మూత్రం పోసుకునేటప్పుడు మంట లాంటి వి కూడా పొత్తికడుపు ఎడమభాగంలో నొప్పికి కారణమయ్యే సిస్టిటిస్ అనే పరిస్థితికి దారి తీస్తుంది.

ఒక్కోసారి పేగు సంబంధిత కారణాలు అంటే తీవ్రమైన నొప్పి, విరేచనాలు, వాంతులు, మలంలో రక్తస్రావం లాంటివి ఈ నొప్పి నిర్థారణకు ఉపయోగపడతాయి. పేగు సంకోచ వ్యాకోచాలు నొప్పికి కారణమయ్యేటప్పుడు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. చీము పట్టడం, పేగు సమస్యలు, పొట్టంతా తిమ్మిరి పట్టడం, అపాన వాయువు ఎక్కువగా రావడం లాంటివి కూడా దీనికి గుర్తులే. అదే విధంగా కిడ్నీ సమస్యలు అంటే… మూత్రపిడ్డాల్లో రాళ్ళు కూడా దీనికి కారణం కావచ్చు. ఈ సమయంలో నొప్పితో పాటు, జ్వరం, వికారం, గజ్జల్లో నొప్పి, వాంతులు లాంటి ప్రభావాలూ ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో మాత్రం దీన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. మిగతావారితో పోలిస్తే మహిళలో విషయంలో దీని పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. గర్భాశయ సమస్యలు మహిళల కడుపు నొప్పికి కారణం కావచ్చు. గర్భాశయం బయట కణజాలం పెరుగుదల, కటివలయంలో నొప్పి, దురద లాంటివి ఉంటాయి.

ఎడమవైపు పొత్తి కడుపులో నొప్పి ఒక్కో సారి ఆహారపు అలవాట్ల వల్ల కూడా కావచ్చు. కాబట్టి సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి. ఫలితంగా మలబద్ధకం సమస్యలు రావు. మీ పొట్టకు సమస్యలు తెచ్చిపెట్టే ఏ ఆహారాన్నీ తీసుకోకపోవడం ఉత్తమం. అదేవిధంగా జీవన శైలిలో మార్పుల ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. నడుముకు సంబంధించిన డాన్సులు, యోగా వంటి శారీరక వ్యాయామాలు ఉదర కండరాల ఇబ్బందులు తొలగిస్తాయి. సరిగ్గా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. అదే విధంగా ఈ తరహా కడుపు నొప్పి రాకుండా చేసే ప్రత్యేకమైన వ్యాయామాలు కూడా తెలుసుకుని చేస్తే, ఇతర కారణాల వల్ల వచ్చే కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఈ కడుపు నొప్పికి కారణాలు తెలుసుకొంటే చికిత్స తేలిక అవుతుంది. మామూలు అంచనాతో తొందరపడటం మంచిది కాదు. వ్యాధి తీవ్రంగా ఉంటే మాత్రం సీటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌, ఎండో స్కోపీ లాంటి పరీక్షలు అవసరం అవుతాయి. వ్యాధిని సకాలంలో గుర్తించటం, కారణ సహితంగా గుర్తించటం ముఖ్యం. దీన్ని బట్టి ఈ నొప్పి తగ్గేందుకు ఏ మందులు వాడాలో నిర్ధారించటానికి వీలవుతుంది.

Leave a Comment