Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? సమస్య పరిష్కారం కోసం..!

By manavaradhi.com

Published on:

Follow Us
Anemia: Symptoms, Causes & Treatment

రక్తం మన శరీరంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏచిన్న సమస్య వచ్చినా అది పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. శరీరంలో తగినంత ర‌క్తం లేకపోతే దాన్ని ఎనీమియాఅంటారు. శరీరంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ముఖ్య కారణాలని చెప్ప‌వ‌చ్చు. మ‌నదేశంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ నానాటికీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువ‌వుతోంది.

శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేనప్పుడు రక్తహీనత అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తాయి. ఎర్ర రక్తకణాలకు ఎరుపు అందించే ప్రొటీన్ హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య వస్తుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారిలో కొన్ని లక్షణాల ఆధారంగా సులభంగా గుర్తు పట్టవచ్చు. వారు బాగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ తరచుగా నీరసపడుతుంటారు. అంటే శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. రోజువారీ పనులకు కూడా త్వరగా అలసిపోతారు. చేయాల్సిన పనులపై ధ్యాస ఉండదు. రక్తహీనత ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీలో నొప్పి వస్తుంటుంది. చేతులు, కాళ్లు చల్లగా తయారవుతాయి.

రక్తహీనతకు కారణాలు ఏంటి ?
సాధారణంగా ఏర్పడే ఎనీమియా ఐరన్‌ లోపం వల్ల ఏర్పడుతుంది. అంటే ఆహారం ద్వారా ఐరన్‌ లభించకపోవడం, లేదా శరీరంలోని కణాలు ఆహారంలోని ఐరన్‌ని శోషించ లేకపోవడం వల్ల ఈ రకం ఎనీమియా ఏర్పడుతుంది. విటమిన్‌ బి12, ఫోలిక్‌ ఆసిడ్ లోపంతో కూడా ఎనీమియా వస్తుంది. కొన్నిసార్లు చాలా అరుదుగా ఇది వంశ పారంపర్య రక్త సంబంధిత జబ్బుగా, జన్యు సంబంధమైన కారణాల వల్ల రావచ్చు. పోషకాహార లోపం, రక్తం ఉత్పత్తిలో ఆటంకాలు ఏర్పడడం, రకాన్ని నష్టపోవడం వల్ల ఎనీమియాకు ప్రధాన కారణాలు.

బాగా పాలీష్‌ చేసిన బియ్యం, రిఫైన్డ్‌ వంటనూనె, పొట్టు తీసిన పప్పుధాన్యాలు ఇలా పోషక పదార్ధాలు లేని ఆహారం భుజించి రక్తహీనతకు చేరువవుతున్నారు. ఎక్కువగా బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌లు తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. మహిళలు నెలసరి సమయాల్లో, ప్రసవం తరువాత రక్తస్రావం వల్ల ఎనీమియాకు లోనవుతారు. శస్త్రచికిత్స వల్ల, కడుపులో పుండ్ల కారణంగా ఏర్పడే అంతర్గత స్రావాల వల్ల, జీర్ణవ్యవస్థలోని లోపాల వల్ల, పిల్లలు కడుపులో పొట్ట పురుగులు పెరగడం వల్ల ఈ ఆరోగ్య సమస్యకు గురవుతున్నారు.

ఎనీమియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఎనీమియాకు మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. క్రమంగా త్వరగా అలసి పోవడం, శ్వాసపీల్చడంలో ఇబ్బంది పడటం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ దశలో దీనిని గుర్తించకపోతే ఇతర లక్షణాలు బయటపడతాయి. గుండె దడ, తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, చేతి గోళ్లు పాలిపోయినట్లు ఉండటం, జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్ష చేసి నిర్ధారిస్తారు. హీమోలైటిక్ రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం.

Leave a Comment