ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అనేది మన శ్రేయస్సుకి కీలకం. జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వ్యాయామలోపం…ఇలా ఎముకల పటుత్వం తగ్గటానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకూ ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎముకల ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
ఈ మధ్య యువతలో చాలామంది నాలుగు మెట్లెక్కారంటే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. 40 ఏళ్లు దాటకుండానే అప్పుడే ఎముకలు గుల్లబారటం మొదలుపెట్టాయి. నేడు మహిళల్లో ఎముకల సమస్యలు మరింత ఎక్కువైపోయాయి. జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వ్యాయామలోపం…ఇలా ఎముకల పటుత్వం తగ్గటానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి.
పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకు ఎముకలు బలంగా ఉండాలంటే మన శరీరానికి క్యాల్షియం అవసరం తప్పనిసరి. కాల్షియం అధికంగా లభించే పాలు, పెరుగు, అత్తి పండ్లు, సాల్మన్ చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సీ లభించే సిట్రస్ జాతి పండ్లతో పాటు విటమిన్ బీ3, ఈ తోపాటు నీరు అధికంగా తీసుకోవాలి.
ఎముకలు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఏవి ?
మనం కూర్చునే భంగిమల కారణంగా కండరాలపై ఎక్కువగా ప్రభావం చూపి తద్వారా కీళ్లు బలహీనమవుతాయి. అందుకని కూర్చునే సమయాల్లో శరీరాకృతిపై దృష్టిపెట్టాలి. ఎక్కువ మోతాదులో ఉప్పు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. క్యాల్షియం తగ్గిపోతుంది. కిడ్నీల ద్వారా క్యాల్షియం బయటకు వెళ్తడానికి కారణమవుతుంది. ఎముకల బలాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కెఫీన్ వల్ల ఎముకల్లో ఉన్న క్యాల్షియం తగ్గిపోతుంది. దీనివల్ల ఎముకలు నిస్సత్తువగా లోనవుతాయి. కాబట్టి కాఫీ, టీలకు బదులు చాకొలెట్ తీసుకోండి.
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకల అభివృద్ధి తగ్గిపోతుంది. ఫ్రాక్చర్స్ అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. పొగతాగే అలవాటున్న వారు చాలా త్వరగా కీళ్లవాతానికి లోనౌతారు. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకల్లో బలం తగ్గడమే కాదు, ఫ్రాక్చర్స్ కి ఎక్కువ అవకాశముంది. కోలాల్లో ఫోస్ఫ్రోరిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని క్యాల్షియంను తగ్గిస్తుంది.
ఎక్కవ సేపు సైక్లింగ్ కూడా ఎముక ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని రకాలు మందులు కూడా ఎక్కువ కాలం తీసుకోవలసి వస్తే అవి కూడా ఎముకల పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. డాక్టర్ ను సంప్రదించకుండా ఎటువంటి మందులు వాడడటం మంచి కాదు.
సూర్యరశ్మి తాకితే శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తవుతుంది. అలా అని గంటల తరబడి ఎండలో ఎక్కువగా తిరిగితే కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అతినీల లోహిత(యూవీ) కిరణాలు తాకితే చర్మం దెబ్బతింటుంది. ఆ కిరణాలు మరీ ఎక్కువగా తాకితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎంత ఎక్కువ కదిలితే ఎముకలు అంత దృఢత్వం ఉంటాయి.
ఎముకలు ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలంటే చదువుతున్నా, పని చేస్తున్నా, టీవీ చూస్తున్నా, స్థానాలను తరచుగా మార్చండి. డెస్క్ లేదా కుర్చీ నుంచి మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. అలాగే చేసే అన్ని పనుల్లో చురుకుగా ఉండటం అవసరం. వ్యాయామం చేస్తున్నా.. ఆటల్లో పాల్గొంటున్నా దెబ్బలు తగలకుండా చూసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. వారంలో కనీసం మూడురోజులైనా శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు చేయాలి. వార్మప్ చేసిన తర్వాత సాగదీత వ్యాయామాలు చేయడం చాలా మంచిది. ఎముకలు, కండరాలు గట్టిపడేందుకు కావాల్సిన వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాలి.
సరైన ఆహార నియమావళి, వ్యాయామాల వల్ల ఎముకల పటుత్వాన్ని పెంచుకోవచ్చు. జీవనశైలి మార్పుల వల్ల ఎముకల వ్యాధులకు దూరంగా ఉండగలుగుతాం. కాబట్టి సరైన జీవనశైలిని అలవర్చుకోండి. మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.