Common Drug Interaction Mistakes : మాత్రలు వేసుకోనేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి…?

By manavaradhi.com

Published on:

Follow Us

చాలమంది మందులు (మాత్రలు) వేసుకోనేటప్పుడు అనేక తప్పులు చేస్తుంటారు… అసలు మందులు విషయంలొ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి సవివరంగా ఇప్పుడు చూద్దాం…

చిన్నపాటి జబ్బులను తగ్గించటం దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల నియంత్రణ, వాటి దుష్ప్రభావాల నుంచి కాపాడటం వరకూ మన ఆరోగ్యం విషయంలో మందుల పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. కొంచ జాగ్రత్తగా, సరైన పద్ధతిలో వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా తగ్గిస్తాయి. నిజానికి వీటిపై శ్రద్ధ ఆసుపత్రికి వెళ్లే ముందే మొదలవ్వాలి. డాక్టర్‌ను ఏం అడగాలి? ఏయే సందేహాలు నివృత్తి చేసుకోవాలి..ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఆచరిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. మాత్ర వేసుకునేప్పుడు నీళ్లు తాగకపోవటం, భోజనం చేశాక వేసుకోవాల్సినవి ఖాళీ కడుపుతో వేసుకోవటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేసే తప్పులు ఎన్నెన్నో. వీటికి తోడు అపోహలూనూ. పెద్ద మోతాదులో మందులు వేసుకుంటే అనర్థమని, ఒకసారి మందులు వేసుకోవటం మొదలుపెడితే వాటికి అలవాటు పడిపోతామని ఎంతోమంది అనుకుంటుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. డాక్టర్‌ చెప్పినట్టుగా మందులు తీసుకోవటం, అదీ పూర్తికాలం వాడుకోవటం, ఏదైనా అనుమానం వస్తే డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవటం ఎంతో అవసరం. కాబట్టి మందుల విషయంలో ఎలాంటి అపోహలకు, పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవటం మంచిది.

ప్రతిదానికీ ఒక పద్ధతుంటుంది. ఇది మందులకూ వర్తిస్తుంది. డాక్టర్‌ చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం తీసుకుంటే పూర్తి ఫలితాలు కనబడతాయి. కానీ మందుల విషయంలో మనం చేసే తప్పులు, పొరపాట్లకు లెక్కేలేదు. కొందరు మందులు వేసుకోవటం తరచుగా మరచిపోతుంటారు. మధ్యలో గుర్తుకొచ్చినా ‘ఏం ఫర్వాలేదులే’ అనే అనుకుంటుంటారు. ఇంకొందరు సూచించిన మోతాదులో వేసుకోరు. బాధ, ఇబ్బంది కాస్త తగ్గగానే పూర్తిగా మానేసేవారు మరికొందరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. పైగా ఈసారి ఇంకా తీవ్రంగా వేధిస్తుంది కూడా. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు కాబట్టి కొంతకాలం వాడాక అంతా బాగుందిలే అనుకుని మందులు మానేసేవారూ ఉన్నారు. కొందరికి జబ్బుల కన్నా మందులు వేసుకోవటమంటేనే ఇబ్బందిగా తోస్తుంటుంది. ఎప్పుడెప్పుడు మందులు మానేద్దామా అనే చూస్తుంటారు. కొన్నిసార్లు రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. నిజానికి చాలారకాల మందులను కలిపి వేసుకున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ కొన్ని మందులను మాత్రం కలపకూడదు. ఇది ఆయా మందులను బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల రెండు, మూడు మందులను వేసుకోవాల్సి వచ్చినపుడు కలిపి వేసుకోవచ్చా అని డాక్టర్‌ను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. ఉపవాసం చేస్తుంటే.. ఉపవాసం చేస్తున్నా కూడా బీపీ, ఫిట్స్‌, గుండెజబ్బుల వంటి దీర్ఘకాల సమస్యలకు వాడే మందులను మానకూడదు. మధుమేహులు ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఒకవేళ చేస్తే రక్తంలో గ్లూకోజు స్థాయులను బట్టి మందు మోతాదులను తగ్గించి వాడుకోవాలి.

కొన్నిమందులు జీర్ణాశయం, పేగుల్లో మాత్రమే పనిచేస్తాయి.ఏదేమైనా అక్కడి వరకూ మందులు చేరాలంటే తగినంత నీరు తాగటం తప్పనిసరి. నీళ్లు తాగకపోతే కొన్నిసార్లు మాత్రలు అన్నవాహిక గోడకు అతుక్కొని పుండు పడొచ్చు. అలాగే థైరాయిడ్‌ హార్మోన్‌ వంటి మాత్రలు వేసుకున్నాక కొద్దిసేపటివరకూ వేడి నీళ్లు, ఛాయ్‌, కాఫీ వంటివి తాగకపోవటమే మంచిది. వేడి తగిలితే హార్మోన్లు పనిచేయవు. మందులను నిటారుగా కూచొనో, నిలబడో వేసుకోవటం మంచిది. వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కూచొని ఉండటం మేలు. మాత్రలు గొంతులో అంటుకున్నట్టు, అడ్డుపడినట్టు అనిపిస్తే మెత్తటి అరటిపండు లేదా మెత్తటి బ్రెడ్‌ ముక్క వంటివి తినటం.. మరింత ఎక్కువ నీరు తాగటం మంచిది. మద్యం మన కేంద్ర నాడీవ్యవస్థను నిద్రాణంగా ఉంచుతుంది. అందువల్ల మద్యం ప్రభావం మూలంగా మందులు పనితీరు మరింత ఉద్ధృతం కావొచ్చు. లేదూ సరిగా పనిచేయకపోవచ్చు. అందువల్ల మాత్రలు వేసుకునేప్పుడు మద్యానికి దూరంగా ఉండటమే మంచిది.

Leave a Comment