Ear Infections : చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే.. !

By manavaradhi.com

Published on:

Follow Us
Tips to Prevent Ear Infections

మన శరీరంలో కళ్లు, ముక్కు, చెవులు చాలా సున్నితమైన అవయవాలు. వీటికి ఏమైనా అయితే ప్రాణం విలవిలలాడిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే.. ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల కారణంగా చెవిలో నొప్పి కలుగుతుంది. చెవి పూడుకుపోయినట్లు ఉండడం, వినబడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవిలో ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో సాధారణంగా వచ్చే సమస్య. దీన్నేచెవిపోటు అంటారు. వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ కారణంగా ఈ చెవిపోటు వస్తుంది.

కర్ణభేరి వెనుక ఉన్న చెవి మధ్య భాగంలోనే ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. దీని వల్ల చెవిలోపలి భాగం వాచిపోవడం, నొప్పిగా ఉండడం గమనించవచ్చు. చాలా సార్లు చెవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్య తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చిన్నచిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్య కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. ఐతే దీర్ఘకాలికంగా వచ్చే ఇన్ఫెక్షన్లు త్వరగా సమసిపోవు.. ఒకవేళ తగ్గిపోయినా.. మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. చెవి ఇన్ఫెక్షన్‌లకు అనేక కారణాలున్నాయి. జలుబు చేయడం, ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో జలుబు చేశాక చెవినొప్పి కూడా కనిపిస్తూ ఉండటం సహజం.

సాధారణంగా ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్లు చెవిలోకీ పాకుతాయి. అలాగే ముక్కుకు వచ్చే అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవినొప్పిని కలిగిస్తాయి. పిల్లల్లో చీము కారుతుంటుంది. కొద్దిమందిలో చెవులు సరిగ్గా వినిపించవు. దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లలోనూ సాధారణంగా ఇలాంటి సమస్యలే ఉంటాయి. కానీ వాటిని దీర్ఘకాలిక సమస్యలుగా మనం గుర్తించలేకపోవచ్చు.. చెవిలో ఇన్ఫెక్షన్ ను పరీక్షించేందుకు ఒటోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వారిలో యూస్టేషన్ ట్యూబ్ చాలా సన్నగా ఉంటుంది. దానిలో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు చెవి పోటు వస్తుంది.

తల్లిపాలు తాగే పిల్లల కంటే బాటిల్ తో పాలు తాగే పిల్లల్లో చెవి పోటు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో చెవిపోటు వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. పెద్దవాళ్లలో చెవి ఎక్కువ నొప్పిగా ఉంటే… వెంటనే గోరు వెచ్చని నీటిలో టవల్ ముంచి దాన్ని చెవి పైన అదిమి పెట్టుకోవాలి. దీంతో కాస్తంత ఉపశమనం కలుగుతుంది. ఏదైనా వాపు ఉన్నా తగ్గుముఖం పడుతుంది. జలుబు వల్ల చెవి నొప్పి ఉంటే కూడా నొప్పిని తగ్గిస్తుంది. చెవి నొప్పి ఎక్కువగా ఉన్న వారు వైద్యుల సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు.

సాధారణంగా చెవినొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి. చెవి నొప్పి ఉన్నప్పుడు కొన్ని సున్నితమైన, సులభమైన వ్యాయామాలు చేస్తే ఇయర్ కెనాల్స్ తెరుచుకుంటాయి. చెవి నొప్పి ఉన్నప్పుడు షార్ప్ గా ఉన్నటువంటి వస్తువులను చెవిలో పెట్టకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ వాడినా.. పై వరకే వాడుకోవాలి. చెవిలో వేసి తిప్పడం మంచిది కాదు. దీని వల్ల మరింత దుమ్ముచేరే అవకాశం ఉంది.

చెవి పోటు రాగానే .. అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి మంచిది కాదు. చెవిలో సోకే ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి దీర్ఘకాలికంగా వినికిడి సమస్య వచ్చేందుకు కారణమవుతాయి. పిల్లల్లో అయితే మాటలు సరిగ్గా రాకపోవడం కూడా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ల కారణంగా చెవిలో కర్ణభేరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ల బారి నుంచి చెవులను కాపాడుకోండి.

Leave a Comment