Iodine Deficiency – పిల్లల భవిష్యత్ ను అంతం చేసే “అయోడిన్ లోపం”

By manavaradhi.com

Published on:

Follow Us
Iodine Deficiency - Signs and Symptoms

శరీరం సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే దానికి అనేక రకాల లవణాలు, పోషక పదార్ధాలు నిత్యం అందుతూ ఉండాలి. అలా అందకపోతే ఏదో ఒక లోపం తప్పదు. అయోడిన్ కూడా ఇలాంటి కీలకమైన పదార్ధం అనే చెప్పాలి. శరీరం, బుద్ధి అన్నీ సక్రమంగా పెరగాలంటే మనం తీసుకునే ఆహారంలో ఈ అయోడిన్ తప్పనిసరి. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ పరిణామం కొంత వరకు ఉంటుంది. అది శరీరానికి సరిపోయేంత లేకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవు. వ్యాధులు చుట్టుముట్టడమే కాదు.., తరువాతి తరాలను సైతం నాశనం చేయగల శక్తి ఈ అయోడిన్ కు ఉంది. పాలు, గుడ్లు బాగానే తింటున్నాం… ఉప్పు కూడా బాగానే వాడతాం అనుకుంటున్న వారిలో కూడా అయోడిన్ లోపం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు. టెక్నాలజీ సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాడు. అయితే ఒక్కోసారి అభివృద్ధి కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. అయోడిన్ లోపం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గ్రామాల్లో ముడి ఉప్పు వాడే వారిలో అయోడిన్ లోపం తక్కువే. పాలిష్డ్ ఉప్పు పేరుతో… తెల్లగా, పొడి పొడి లాడుతున్న ఉప్పును వినియోగిస్తున్న వారిలోనే ఈ అయోడిన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలోనే కాదు.., ప్రపంచ వ్యాప్తంగా అయోడిన్ లోపం చాప కింద నీరులా మనిషిని దెబ్బతీస్తోంది.

ఆహారంలో అయోడిన్ ఇంత కలపి వాడుకోవాలి అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే అయోడిన్ అనేది కంటికి కనిపించని మూలకం. సాధారణంగా ఉప్పు, పాలు, చేపలు వంటి ఆహారంలో దొరుకుతుంది. అవి వాడుతున్నాం కాబట్టి అయోడిన్ లోపం లేదు అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో అయోడిన్ లోపం కనిపిస్తోంది. మన దేశంలోనూ అయోడిన్ లోపంతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిలో అయోడిన్ లోపం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే అయోడిన్ ఉప్పునే వాడండని ప్రచారమూ చేస్తోంది. అయోడిన్ లోపం పెద్ద వ్యాధిలా కనిపించకపోవచ్చు. కానీ దాని దుష్పరిణామాలు చిన్నపిల్లలపై తీవ్రంగా ఉంటుంది.

అయోడిన్ లోపం వలన ఎక్కువగా కనిపించే సమస్య గాయిటర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో మెడకు రెండు వైపులా వాపు కనిపిస్తుంది. ఈ వాపు చిన్న బొడిపెలా ఉండవచ్చు. లేదా భయానకంగా కనిపించే రీతిలో బాగా ఉబ్బి కూడా ఉంటుంది. కొందరిలో తల కింద భ్రాగంలో భారంగా ఓ కాయ మోస్తున్నట్టు ఉంటుంది. ఈ వాపు అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది పెద్ద వారిలో కనిపించే ప్రధాన లక్షణం. అయితే చిన్నారుల్లో అయోడిన్ చేసే చెరుపు చాలానే ఉంది. ముఖ్యంగా గర్భిణీల్లో అయోడిన్ లోపం ఉంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పుట్టే పిల్లల్లో మానసిక వికాసం లేకపోవడం… పెరిగే కొద్దీ బుద్ధి మాంద్యంతో ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరి పిల్లల్లో కంటి చూపు, వినికిడి శక్తి సమస్యలకు కూడా ఈ అయోడిన్ లోపమే కారణం. మరికొందరు పిల్లలలో ఎముకల పటుత్వం తగ్గిపోతుంది. దీంతో నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, మరుగుజ్జుగా తయారవ్వడం లాంటి సమస్యలు వస్తాయి.

కొంతమంది గర్భిణీలలో అబార్షన్ కావడం.., మృత శిశువు జన్మించడం లాంటివి కూడా ఈ అయోడిన్ లోపం కారణంగానే జరుగుతుంది. చిన్నారుల్లో కనిపించే ఈ సమస్యలతో పోలిస్తే గాయిటర్ వ్యాధి తక్కువ ప్రభావవంతమైనదే. కానీ పెద్ద వాపుతో కనిపించి భయపెడుతుంది. నిజానికి గర్భిణీలు, చిన్నారుల్లో ఇలాంటి కనిపించే లక్షణాలు ఏమీ ఉండవు. కానీ సరిచేయలేని నష్టాలు మాత్రం అయోడిన్ లోపం వలన కలగవచ్చు.

అయోడిన్ లోపం వలన సమస్యలు వచ్చిన తరువాత వాటిని సరిదిద్దడం కంటే.., అసలు అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడమే ఉత్తమం. గర్భిణీలు ఎప్పటికప్పుడు తాము తీసుకుంటున్న ఆహారంలో అయోడిన్ ఉంటుందా లేదా అనే అవగాహనతో ఉండాలి. పిల్లలకు అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడాలి. ముడి ఉప్పుతో పాటు పాలు, గుడ్లు, సముద్రపు చేపలు, మాంసం, పప్పు ధాన్యాలలోనూ అయోడిన్ ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఈ పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే అయోడిన్ ఉప్పు ధర కాస్త అధికంగా ఉండవచ్చు. కానీ అది శరీరానికి చాలా అవసరం అని గుర్తించాలి. అలాగే అయోడైజ్డ్ ఉప్పు అని వాడుతున్న వాటిలో నాణ్యత ఎంతో కూడా గుర్తించాలి. అయోడిన్ అనేది గాలిలో కలిసిపోయే మూలకం. అయోడైజ్డ్ ఉప్పు ప్యాక్ చేసినప్పుడు కొంత వరకు దాని గుణాన్ని కోల్పోతుంది. కాబట్టి తయారుచేసి మరీ ఎక్కువ కాలం అయిన ఉప్పు ప్యాకెట్లను కొనకపోవడమే మంచిది. అలాగే ఉప్పును సీసాల్లో భద్రపరిచే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి. సీసా మూత తెరిచి ఉంటే అందులో ఉండే అయోడిన్ మూలకం ఆవిరి అయిపోతుంది. కాబట్టి సీసా మూత బిగించి ఉండాలి.

ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారికి దీనిపై మరింత అవగాహన అవసరం. ఆ ప్రాంతాల్లో పండే పంటల్లో అయోడిన్ శాతం తక్కువ ఉంటుంది. ఏటవాలుగా ఉండటం వలన భూమిలో సారం కొట్టుకుపోయి పంటల్లో అయోడిన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో నివసించే వారు ఎప్పటికప్పుడు తమ శరీరానికి సరిపడా అయోడిన్ అందుతుందా అనేది చూసుకుంటూ ఉండాలి. అయోడిన్ లోపం వలన నవజాత శిశువుల్లో ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. తొలి రోజుల్లోనే అయోడిన్ లోపాన్ని గుర్తిస్తే సమస్య కొంత వరకు పరిష్కరించవచ్చు.

అయోడైజ్డ్ ఉప్పు అని పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించినంత మాత్రాన.., ప్రచారం చేసినంత మాత్రాన మనం తినే పదార్ధాల్లో అయోడిన్ ఉంటుందని అనుకోవడానికి లేదు. ప్యాకింగ్, రవాణా, నిల్వ చేయడం, వంట వండే పద్ధతి.., ఇలా అనే క దశల్లో అయోడిన్ ఆవిరి అయిపోతూ ఉంటుంది. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పుతో పాటు ఆ మూలకం అందే మిగతా పదార్ధాలు కూడా ఆహారంలో భాగం కావాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులకు ఇది మరింత అవసరం.

Leave a Comment