low bp treatment: లో బీపీ ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Low Blood Pressure

చాలామందిలో హైబీపీ కనిపిస్తుండటం స‌ర్వ సాధార‌ణం. కానీ లో బీపీ అనే పదం చాలా కొద్దిమందిలో మాత్రమే వింటుంటాం. ఈ లోబీపీ నే హైపో టెన్ష‌న్ అని అంటారు. లోబిపి ఉన్నవారికి శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా ప‌డిపోయి బాడీ షాక్‌కు గురైన‌ట్టుగా ఉంటుంది. ఇలా బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కొంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావాల్సి ఉంటుంది. అసలు లోబీపీ వల్ల ఏమైనా హాని ఉంటుందా? దీన్ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా మన శరీరంలోని రక్తం ధమనుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ధమనుల్లో ప్రవహించే రక్తం వీటి లోపలి గోడల మీద కలిగించే ఒత్తిడిని రక్తపోటు అంటారు. ఈ రక్తపోటు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. గుండె సంకోచించినపుడు గుండె నుండి రక్తం ధమనుల్లోకి ప్రవహించినపుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. దీనినే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. గుండె వ్యాకోచించినప్పుడు రక్తపోటు తక్కువగా ఉండటాన్నే డయాస్టోలిక్ ప్రెజర్ అంటారు. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో రక్తపోటు 120/80 ఉంటుంది. ఈ స్థాయి 90/60 కంటే తగ్గితే దాన్ని లోబీపీగా చెబుతారు.

బీపీ తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. లో బీపీ ఉన్నప్పుడు కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, నీరసంగా ఉండటం, చిన్నపనికే అలసిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోబిపి రావడానికి అనేక కారణాలున్నాయి. గుండె సమస్యలున్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా అందకపోవడం వల్ల, డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు కూడా లోబీపీ కి గురయ్యే అవకాశం ఉంది. ఎండోక్రైన్ గ్రంథి సమస్యలున్నవారికి.. రక్తంలోకి బాక్టీరియా, వైరస్‌లు ప్రవేశించి ఇన్‌ఫెక్షన్ అయినపుడు కూడా లోబీపీ రావచ్చు అంటున్నారు వైద్యులు. అందువల్ల ఈ సమస్యలున్నప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

లో బీపీ అనేది అంతర్లీన సమస్య. కొన్నిసార్లు గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగించే బీటా బ్లాకర్స్ మరియు నైట్రోగ్లిజరిన్ లాంటి మందులు వల్ల కూడా లోబిపి రావచ్చు. తీవ్రమైన లేదా తేలికపాటి రక్తం నష్టపోవడం వల్ల లోబీపీ కి దారితీస్తుంది. తీవ్రమయిన అవయవాల నొప్పి కూడా లోబీపీ కి కారణమవుతుంది. ఈ సమస్య వృద్ధుల్లో ఉన్నప్పుడు గుండెకు, మెదడుకు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు సరైన రక్త ప్రసరణ జరగదు. ఎటువంటి లక్షణాలు లేకుండా దీర్ఘకాలికంగా ఉండే లో బీపీ దాదాపు ఎన్నటికీ తీవ్రమైనది కాదు.. కానీ రక్తపోటు అకస్మాత్తుగా తగ్గిపోతున్నప్పుడు మరియు మెదడు తగినంత రక్త సరఫరాను కోల్పోయినప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు.

మగతగా ఉంటారు. ఎవరైతే ఎక్కువగా కూర్చుంటారో లేదా కూర్చొని పైకి లేస్తారో వారిలో సాధారణంగా రక్తపోటు ఆకస్మికంగా తగ్గిపోతుంది. ఈ రకమైన రక్తపోటును పోస్ట్యూరల్ హైపోటెన్షన్ లేదా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. చాలాసేపు నిలబడేవారిలో మరో రకమైన రక్తపోటు వస్తుంది. దీన్నే న్యూరల్లీ మీడియేటెడ్ హైపోటెన్షన్ అంటారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో రక్తపోటు పడిపోవడం లేదా తగ్గడం జరుగుతుంది. కొన్ని పరిస్థితులు అంటే గాయం వల్ల పెద్ద మొత్తంలో రక్త నష్టం అయినప్పుడు దీర్ఘకాలపు హైపోటెన్షన్లకు దారి తీయవచ్చు, దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరంగా మారవచ్చు.

బీపీని ఎప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉండేలా చేసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. లో బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కోంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం అనివార్యం. కొన్ని స‌హ‌జ‌మైన చిట్కాల‌తో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం చాలా సుల‌భం. నెమ్మదిగా కదలికలతో ఆర్థో స్టాటిక్ హైపోటెన్షన్ కు చికిత్స తీసుకోవచ్చు. త్వరగా నిలబడడానికి బదులుగా.. చిన్న కదలికలను ఉపయోగించి కూర్చోవడం లేదా నిలబడి ఉండటం వల్ల రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావచ్చు. మీరు కూర్చుని ఉన్నప్పుడు మీ కాళ్ళను విడిగా వదిలేయటం ద్వారా ఈ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ను నివారిచవచ్చు.

లోబీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే కొన్ని జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మంచి ఆరోగ్య పోషకాలు ఉన్న ఆహారం అవసరం. విట‌మిన్ B12, విటమిన్ E లు లోబీపీని సాధార‌ణ స్థాయికి తీసుకువస్తాయి. కానీ హైబీపీ ఉన్న‌వారు విట‌మిన్ E తీసుకోకపోవడమే మంచిది. ఈ విట‌మిన్లు కావాల్సినవారు తప్పనిసరిగా బాదంప‌ప్పు, పాల‌కూర‌, గుడ్లు, పాలు, చీజ్‌, చేప‌లు తినాలి. వైద్యుల స‌లహా మేరకు విట‌మిన్ ట్యాబ్లెట్లు తీసుకోవచ్చు. కాఫీలో కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తాత్కాలికంగా పెంచ‌డంలో స‌హ‌క‌రిస్తుంది. రోజు సరిపడా మంచినీరు తాగడం, మితంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల లో బీపీ సమస్యను అధిగమించవచ్చు. అలాగే బీపీ నార్మల్ అయ్యేవరకు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. రోజూ సైక్లింగ్, వాకింగ్ లేదా యోగా వంటి చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూ లో బిపికి దూరంగా ఉండండి.

Leave a Comment