Morning Workout: వ్యాయామం ఇలా చేస్తేనే లాభం!

By manavaradhi.com

Published on:

Follow Us
Morning Workout

ప్రతి ఒక్కరూ శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకొనేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతూ వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. కొంద‌రు జిమ్‌ల‌కు వెళ్తుండ‌గా.. మ‌రికొంద‌రు స‌మ‌యం దొర‌క్క ఇంటి వ‌ద్ద‌నే మ‌మ అనిపించేస్తున్నారు. వ్యాయామం చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చిన్న‌చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ మంచి ఫలితాలు పొందవచ్చు. మన శ‌రీర బరువు ఆధారంగా చేయదగ్గ వ్యాయామాలు, నిత్యం ఉపయోగించే ర‌క‌రకాల వస్తువులతోనే చేయదగ్గ ఎక్సర్‌సైజ్‌లతో జిమ్‌లో చేసిన ఫలితాలు పొందవచ్చు. వ్యాయామం చేయాల‌నే ఇంట్ర‌స్ట్ ఉన్న‌వారు ఇంట్లోనే చిన్న వ్యాయామాల‌తో మొద‌లుపెట్టి పెద్ద‌పెద్ద బ‌రువులెత్తే వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా మార్నింగ్ వాక్ కే ప్రాధాన్యం ఇవ్వండి. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించుకోవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల విటమిన్ డి కూడా అందుతుంది. ఎముకలు పెలుసుగా మారడం, కండరాల నొప్పులతో పాటు మాన‌సిక‌ ఒత్తిడి కూడా తొలిగిపోతుంది. దీంతోపాటు ఆరోగ్యం, చక్కని శరీరాకృతి మ‌న సొంత‌మ‌వుతాయి. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా కూర్చుండి చేసే ఉద్యోగాలు కావ‌డంతో శ‌రీరానికి కొంత కూడా వ్యాయామం జ‌రుగ‌డంలేదు. ఫ‌లితంగా బ‌రువు పెర‌గ‌డం, ఒబేసిటీ స‌మ‌స్య‌లు రావ‌డం మ‌నం చూస్తుంటాం. ఇలాంటివి దూరంగా ఉండాలంటే ఉద‌యాన్నే వ్యాయామాలు చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. ఉద‌యాన్నే కాల‌కృత్యాలు తీర్చుకొని ఉన్న కొంత స‌మ‌యంలో చిన్నిచిన్న వ్యాయామాలు చేయాలి. వ్యాయామం చేయడం వలన రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. క్యాలరీలను తొలగించటానికి ఇవి చాలా మంచివి.

వ్యాపారాల‌కు వెళ్లే వారు, బిజినెస్‌ అపాయింట్‌మెంట్ క‌లిగేవారికి ఉద‌యాన్నే వ్యాయామం చేయ‌డం కుద‌ర‌దు. అలాంట‌ప్పుడు మాల్‌గానీ, ఆఫీస్‌గానీ ఇత‌రత్రా ప‌నిప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు మీ వాహ‌నాన్ని దూరంగా పార్కింగ్ చేసి న‌డుచుకుంటూ రావ‌డం వ‌ల్ల వ్యాయామం చేసిన ఫ‌లితం పొందుతాం. అలాగే లిఫ్ట్‌గానీ, ఎలివేట‌ర్‌గానీ వాడ‌కుండా మెట్లు ఎక్క‌డం అల‌వాటు చేసుకోవాలి. వ్యాయామాల్లో నిర్మాణాత్మ‌క శారీర‌క శ్ర‌మ కూడా ముఖ్య‌మైన‌దే. నడక, యోగా, బరువులు ఎత్తడం, బైకింగ్, రన్నింగ్, ఈత – ఇవన్నీ ఉదయం వేళ ఎంపిక చేసుకోవాల్సిన‌ వ్యాయామాలు. సహజమైన గాలి, కాలుష్యరహిత ప్రాంతాల్లో వ్యాయామం చేయడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉద‌యం వ్యాయామాల‌తో జీవ‌క్రియ‌ల‌కు కావలసిన శక్తిని అందించవ‌చ్చు. రక్తప్రసరణ స‌క్ర‌మంగా సాగి రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. వ్యాయామంతోపాటు నిత్యం యోగా సాధ‌న చేయ‌డం కూడా చాలా మంచిద‌ని గుర్తుంచుకోవాలి.

మ‌న ఉద్యోగ విధానాలు, జీవనశైలి ఎలా ఉన్నా.. నిత్యం ఉద‌యాన్నే 30 నిమిషాలపాటు వ్యాయామం చేయ‌డం వల్ల ప‌లు వ్యాధులు రాకుండా నిరోధించవచ్చంటున్నారు నిపుణులు. ఉద‌యం నీరెండెలో ఉన్న కాసింత స‌మ‌యాన్ని వ్యాయామానికి కేటాయించి శ‌రీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోండి.

Leave a Comment