Osteoporosis: ఈ సమస్య ఉంటే ఎముకలు బలహీనపడతాయ్‌.. జాగ్రత్త..!

By manavaradhi.com

Published on:

Follow Us
Osteoporosis

బోలు ఎముకల వ్యాధిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ఎముకలకు సంబంధించినది. సాధారణంగా వయసుపెరిగేకొద్దీ క్యాల్షియం తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని ఎముకలు బలహీనపడి విరిగిపోతుంటాయి. కానీ బోలు ఎముకల వ్యాధి రావడం వల్ల ఎముకలలోని కణజాలం క్షీణించి ఎముకలు పెళుసుబారి తేలికగా విరిపోతుంటాయి. ఎముకలు బలహీనమైనపుడు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెన్నెముకలో నొప్పిగా అనిపించడం, మోకాళ్ళలో నొప్పి, నిద్ర నుంచి లేచేటప్పుడు భరించలేని నొప్పి, తుమ్మినపుడు, దగ్గినపుడు ఎముకలు విరిగెటంత నొప్పి అనిపించడం, తుంటి భాగంలో సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్సను తీసుకోకపోతే రోజువారీ పనులు చేయలేని స్థితికి చేరుకుంటారు. ఈ వ్యాధి ఏ వయసువారికైనా రావచ్చు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా వస్తుంది. మన దేశంలో మెనోపాజ్ దశకు చేరిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, 60 ఏళ్ళు దాటిన పురుషులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉన్నట్టు వ్యాధి రావడానికి కూడా ఖచ్చితమైన కారణం ఉంటుంది. పౌష్టికాహార లోపం, విటమిన్ D శరీరానికి కావలసినంత లభించక పోవడం, ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ వల్ల అండాశయాలు తొలగించడం వల్ల , ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల ఎక్కువగా వస్తుంది. ఎముక సాంద్రతను బట్టి ఈ వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టు ప్రతి వ్యాధికి చికిత్స కూడా ఉంటుంది. ఈ బోలు ఎముకల వ్యాధి కూడా క్యాల్షియం థెరపీ, క్యాలిటోనిన్, ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ మొదలైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ బోలు ఎముకల వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందిపెడుతోంది. 50% మహిళలు, 25% పురుషులు ఈ వ్యాధి వలన నడుం నొప్పి, వెన్నుపూస సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎముకల ఆరోగ్యంపైన మన జీవనశైలి ప్రభావం ఎలా ఉంటుంది? మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె ఉన్న పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా అంజీరా, నారింజలో ఉంటుంది. పాల ఉత్పత్తుల నుండి లభించే ప్రోటీన్ కాకుండా జంతువుల నుండి లభించే ప్రోటీన్ వల్ల ఎముకలు పెద్ద మొత్తంలో బలహీనపడతాయి. అందుకే శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో అంతే తీసుకోవాలి.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు మోయడం, కండరాలను బలోపేతం చేయడం, బ్యాలెన్స్ ట్రైనింగ్ లాంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఎముక ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ D ని ప్రోటీన్ ఎక్కువగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఎముకల సమస్యలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

పోషక విలువలు కలిగిన ఆహారం, శారీరక శ్రమ, ఎముకలను బలంగా ఉంచుతుంది. జీవనశైలిలో వ్యాయామాన్ని ఓ భాగంగా చేసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ D లను తగు మోతాదులో తీసుకొని ఈ బోలు ఎముకల వ్యాధికి దూరంగా ఉండాలని నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది.

Leave a Comment