మనిషి జీవితంలో కంప్యూటర్ నిత్యావసరంగా మారిపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా కంప్యూటర్ అవసరం లేకుండా జరిగే పనులను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. దీని వల్ల కంప్యూటర్ మీద గంటల తరబడి పని చేసే వారికి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల వెన్నెముక మీద అధిక వత్తిడి పడి స్పాండిలోసిస్ సమస్యలకు దారి తీస్తోంది.
స్పాండి లోసిస్… స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య. వెన్నుపూస మరియు నడుము మధ్య దూరాన్ని పెంచే లేదా తగ్గించే విధంగా అనుసంధానమై ఉండే కణజాలాన్ని క్షీణింపజేసే సమస్యే అర్థసైటిస్ లేదా స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే… వెన్నుపూసల మధ్య కలిగే ఇన్ ఫ్లమేషనే స్పాండిలైటిస్. రెండు పూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వల్ల వెన్నుపూసలు ఉండే నరాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య వస్తుంది. ఇది మెడ భాగానికి వస్తే, సెర్వైకల్ స్పాండిలోసిస్ గా చెబుతారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడం లాంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా కంప్యూటర్, ల్యాప్ టాప్ మీద పని చేసే వారితో పాటు… ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో గడిపే వారిని కూడా ఈ సమస్య తీవ్రంగా బాధిస్తోంది.
గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేసే వారిలో సెర్వికల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్ సెంటర్లలో పనిచేసే వారిలో, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. ద్విచక్రవాహనం ఎక్కువగా నడిపే వారిలో, అధిక బరువు మోసే వారిలోనూ ఈ వ్యాధి అరుదుగా కనిపిస్తుంది. డెస్క్ టాప్ కంటే ల్యాప్ టాప్ వల్లే స్పాండిలైటిస్ సమస్య ఎక్కువగా పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారంగా ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని ముందుకు వంగుతాము. దీని వల్ల వెను భాగం మీద అధిక ఒత్తిడి పడుతుంది. దీని వల్ల త్వరగా వెన్నునొప్పి సమస్యలు మొదలై… స్పాండిలైటిస్ గా దారి తీసే ప్రమాదం ఉంది. అదే విధంగా ల్యాప్ టాప్ స్క్రీన్ చూసేందుకు చాలా మంది మెడ వంచుతారు. ఇది మెడనొప్పితో మొదలై… మెడకు సంబంధించి స్పాండిలైటిస్ సమస్యకు దారితీస్తుంది.
ఒక్కసారి స్పాండిలైటిస్ వచ్చిందంటే ఎన్నో సమస్యలు మనల్ని బాధపెడుతూ ఉంటాయి.
- • తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి.
- • మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి.
- • చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోతుంది.
- • నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది.
- • నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.
- స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.
ఇంట్లో చేసుకునే పరిష్కారాలు అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చినా… దీర్ఘకాలంలో వీటి నుంచి రక్షణ పొందాలనుకునే వారు, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పని సరి. కంప్యూటర్ తో పని చేయడం తప్పదు అనుకున్న వారు కొన్ని నియమాలు తప్పక పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
- • తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఉంటాలి.
- • కంప్యూటర్ మీద పని చేసే సమయంలో గంటకోసారైనా కాసేపు అంటూ ఇటూ తిరగాలి.
- • కూర్చునే తీరు కూడా వెన్నుపూస మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకే విధంగా ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదు. భంగిమ మారుస్తుండాలి.
- • కాళ్ళను ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడం కూడా సమస్యలు తెచ్చి పెడుతుంది.
- • వెన్ను భాగం కుర్చీకి ఆనుకుని ఉండేలా కూర్చోవడం తప్పని సరి.
- • పాదాలు పూర్తిగా నేలకు ఆనుకుని ఉండి, మోకాలు కింది భాగం 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి.
- • కుర్చీలో ఒక వైపు ఒంగి కూర్చోవడం లాంటివి చేయకూడదు.
- • మెడపై భారం పడకుండా తగిన స్థానంలో కంప్యూటర్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
- • ల్యాప్ టాప్ ను వాడేటప్పుడు ఒళ్ళ కాకుండా… సరైన స్థానంలో ఉంచి వాడాలి.
- • ఎక్కువ సేపు మెడవంచి ఫోన్ చూడకుండా, ఫోన్ స్థానం మారుస్తూ ఉపయోగించాలి.
స్పాండిలైటిస్ మొదలయ్యాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే… ముందుగానే జాగ్రత్త పడ్డం వల్ల ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా సరైన భంగిమ అవసరం. అలాగే నిద్రపోయే సమయంలో తలకింద అనువైన దిండు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళనకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకూ పరిష్కరించుకోవచ్చు.