Calories In A Day: మనం రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Calories In A Day

మన శరీరానికి క్యాలరీలు కావాలంటే.. మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం నుంచి లభించిన క్యాలరీల వల్ల శరీరానికి శక్తి అంది.. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఐతే రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం ..? క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే ఎమౌతుంది.. ? ఎక్కువైన క్యాలరీలను తగ్గించుకునేందుకు ఏం చేయాలి ?

శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అంటే కేలరీలు ఉండే ఆహారాన్ని తినాలన్నమాట. అయితే అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనే అంశంపై చాలామందికి స్పష్టత ఉండదు. మనిషి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. సగటున ఒక మనిషికి 2 వేల క్యాలరీల శక్తి అవసరం. ఈ క్యాలరీలకు మించిన ఆహారాన్ని తీసుకుంటే వారిలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం వస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుని వాటిని ఖర్చు చేసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్న వారు ఎక్కువ కేలరీలుఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ఎక్కువ బరువు ఉన్న వారు తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక బరువు తగ్గించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా వ్యాయామం చేసి శరీరానికి అధికంగా అందిన క్యాలరీలను ఖర్చు చేసుకోవాలి. ప్రతిరోజు తాజాపండ్లతో పాటు కూరగాయలు,ఆకుకూరలు, పాలు, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రొటీన్‌లతో పాటు మంచి కేలరీలు అందుతాయి.

ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా క్యాలరీలు అవసరం ఉంటాయి. ఇందుకోసం ఎవరి క్యాలరీలను వారు నిర్ధారించుకోవాలి. ఎత్తు, బరువు ఆధారంగా క్యాలరీలు నిర్ధారిస్తారు. దీనికి అనుగుణంగా ఎవరికి వారు తమ డైట్ ను పాటించవచ్చు. తద్వారా అనవసరంగా శరీరంలో క్యాలరీలను పెంచుకుని ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఆహారం తీసుకునేటప్పుడే క్యాలరీలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ కేలరీలు తగ్గించుకోవాలంటే ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం మానేయాలి. ఇలాంటి వాళ్లు పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్‌డ్రింకులు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు.

చిన్నపిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అసవరం కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉండాలి. అంటే వాళ్లు పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనిని బట్టి కూడా కేలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువగా పనిచేసే వారు ప్రతిరోజు 2,200 కేలరీల ఆహారం తీసుకోవచ్చు.

శరీరానికి సరిపడా శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు సమపాళ్లలో ఉండేలా చేసుకోవాలి. అయితే వీటిని కొలుచుకుని, చూసుకుని తినాల్సిన పని లేదు. మనం రోజూ తినే అన్నం, చపాతీలను ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే చాలు. పిండి పదార్థాలకు ప్రొటీన్‌ను జత చేసుకున్నట్లే. శరీరానికి కావలసిన క్యాలరీలు మాంసాహారంలో అధిక మొత్తంలో ఉంటాయి. అలాగని రోజూ దీన్నే తింటే ఇందులో ఎక్కువగా ఉండే కొవ్వులు శరీరంలోకి చేరతాయి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వారానికోసారో.. రెండుసార్లో తినాలి.


శరీరానికి కావలసిన ప్రొటీన్లు, ఎ, డి, ఇ విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్, మార్కెట్లో దొరికే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు , ప్యాకేజ్ లలో లభించే ఆహారాల వల్ల శరీరంలో క్యాలరీలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండి .. ఇంట్లో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవడం మేలు.

శరీరంలోకి వెళ్తున్న క్యాలరీలపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. ఇదే శారీరక మెటబాలిజమ్ ను నిర్దారిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. తక్కువ క్యాలరీల కోసం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం మంచిది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. స్థూలకాయం తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

Leave a Comment