మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఛాతీ నొప్పి కూడా ఒకటి. ఈ సమస్య గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఒక్కసారిగా ఇది చుట్టు ముడుతూ ఉంది. కొన్ని సమయాల్లో ప్రాణాపాయంగా మారుతోంది. అసలు ఈ పరిస్థితి కారణాలేమిటి, ఈ సమస్య నుంచి బయట పడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందామా.
ఛాతినొప్పి అనేది గుండెకి సంబంధించిన దానివల్ల వస్తుందా లేదా..ఇతర కారణాల వల్ల వస్తుందా అనేది చాలా మందికి అనుమానం వస్తుంది. రక్తపోటు, కొలెస్టరాల్ అధికంగా ఉండటం, రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం, మధుమేహం కూడా తోడవటం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక స్థాయిలో ఒత్తిడికి లోనవుతుండటం వంటి కారణాల వల్ల ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తసరఫరా అయ్యేటప్పుడు ఏ కారణం వల్లనైనా ఇబ్బంది ఏర్పడి రక్తప్రసరణ కష్టమవుతుంది. రక్తం పూర్తిగా ప్రవహించకపోవడంతో భరించలేని విధంగా ఛాతీలో నొప్పి వస్తుంది. చాలామందిలో ఎక్కువగా వచ్చే సాధారణమైన నొప్పి ఇది. ఈ నొప్పిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే గుండెపోటుకు గురి కాకుండా జాగ్రత్తపడవచ్చు. దీనికి సంబంధించిన నొప్పి కేవలం కొద్ది నిముషాలు మాత్రమే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే ఒకసారి ఈ నొప్పి వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో గుండెపోటు వస్తుందని గుర్తించాలి. మెట్లెక్కడం, పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం వంటి వాటికి దూరంగా వుండడం చాలా అవసరం. భరించరాని నొప్పి వచ్చి అది కేవలం అక్కడే ఉండకుండా ఎడమవైపు చేతిలోపలిభాగంలోకి నొప్పి రావడం.. విపరీతమైన చెమటలు పట్టడం దాంతో పాటు వామ్టింగ్స్ రావడం.. వాంతి అవుతున్నట్టు అనిపించడటం జరుగుతుంది. చాతిలో నొప్పి 120 నిమిషాలకు పైగా ఉన్నట్టయితే తప్పకుండా హార్ట్ ఎటాక్‌గా అనుమానించి వైద్యుడ్ని సంప్రదించాలి.
ఛాతినొప్పికి కారణాలు ఏంటి…?
కొంతమందికి ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో నొప్పి అనేది సివియర్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నవారిలో నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి వచ్చినప్పుడు ఛాతిలో చాలా కొద్దిగా అసౌకర్యంగా అనిపించి హఠాత్ మరణం చెందవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నవారిలో నొప్పి రాకపోవడంతో గ్యాస్ట్రబుల్ వలనో లేక మసాలా ఆహారాన్ని తినడం వల్ల నొప్పి వచ్చిందని వారు అశ్రద్ద చేస్తారు. కానీ ఇటువంటి సింటెమ్స్ వచ్చినవెంటనే ఆసుపత్రికి వెళ్లి ఇసీజీ అనేది ప్రధానంగా చేయించుకోవాలి. ఈ ఇసీజీ అనే చిన్న పరీక్ష ద్వారా వారికి నిజంగానే హార్ట్ఎటాక్ వచ్చిందా లేదా తెలుస్తుంది. దాంతో వారిని ఆసుపత్రికి తరలించి తక్షణమే ట్రీట్మెంట్ చేయిస్తే గుండె కండరాలు దెబ్బతినకుండా కాపాడవచ్చు. శారీరకంగా బాగా శ్రమించినప్పుడు చాతిలో నొప్పి వస్తే దానిని గుండెనొప్పిగా భావించాలి. అజీర్ణం సమస్యతో సతమతమవుతున్నప్పుడు ఎసిడిటీ, హార్ట్ బర్న్‌తో కూడా నొప్పి వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎప్పుడూ ఏదో తెలియని నీరసం వేధిస్తుంటుంటే గుండెపొర వ్యాధిగ్రస్తమైనట్టు గుర్తించాలి. వయస్సు 60 దాటిన వారిలో నొప్పి తీవ్రంగా వస్తుంటే బృహద్దమని వల్ల గానీ ఉబ్బసం వల్ల గానీ అని అనుమానించాలి.ఛాతిలో నొప్పితోపాటు ఆయాసం, దగ్గు, జ్వరం వంటివి కూడా ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ గా భావించాలి.
ఛాతినొప్పికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
ఛాతిలో గాని, పై పొట్టలో గాని నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ సమస్యగానే అనుకుంటాం. చాలా సందర్భాల్లో అది గుండెనొపిప కాకపోవచ్చు. అలాగని అలక్ష్యం చేస్తే అది గుండె సమస్యే అయివుండొచ్చు. అందుకే అది ఏ నొప్పా అని ఇలా గుండె బద్దలు కొట్టుకోకుండా ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. గ్యాస్టిక్ సమస్య వల్ల కూడా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలు చాలా ఎసిడిటీని కలిగిస్తాయి. ఛాతీ దగ్గర్లో చాలా మంటని కలిగిస్తాయి. బాగా బరువులు ఎత్తుతున్నప్పుడు ఒక్కోసారి ఛాతి నొప్పి వస్తుంది. ఛాతి కండరాలు అతిగా అలసిపోయినప్పుడు ఈ నొప్పి కలుగుతుంది. గుండెకు చెందిన రక్తనాళంలో బ్లాకేజ్ ఏర్పడటమే కాకుండా.. రక్తం, ఆక్సిజన్ గుండెకు సరిగా అందకుండా అడ్డుకుంటుంది. ఇది గుండె నొప్పికి కారణమవుతుంది. గుండెకి దగ్గరగా ఉండే ఊపిరితిత్తుల భాగంలో వాపులాంటివి వస్తే ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. ఊపిరితీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఛాతీ నొప్పికి కారణమవుతుంది. అలాగే ఊపిరి సరిగా అందకపోవడం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అందుకని ఛాతిలో నొప్పి రాగానే గుండె నొప్పిగా భయపడిపోయి అందర్నీ ఇబ్బంది పెట్టకుండా సమస్యేంటో తెల్సుకుని అందుకు తగిన చికిత్స తీసుకొంటే మంచిది.