ప్రస్తుత కాలంలో పలు రకాల కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. కొందరు తట్టుకోలేక తరచుగా టాబ్లెట్స్ వేసుకుంటారు. అలా చేయటం ప్రతిసారీ మంచిది కాదు. అవి తాత్కాలింగా ఉపశమనం కలిగించినా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ లు కూడా కలిగిస్తాయి. అసలు తలనొప్పికి కారణాలు ఏంటి ? దాన్ని నుంచి బయటపడే మార్గాలు ఏంటి..?
ఉరుకుల పరుగుల బిజీ యుగంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి కారణాలతోపాటు జన్యు పరమైన మార్పులు, అనారోగ్య సమస్యలతో తలనొప్పి రావడం సర్వ సాధారణమైపోయింది. కారణాలేమున్నా తలనొప్పి వచ్చిందంటే దాన్ని వెంటనే తగ్గించుకునేందుకు జాగ్రత్త పడాలి. లేదంటే కొన్ని రకాల తలనొప్పులు ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి వచ్చే విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవుతుంటుంది. ఈ సందర్భంలో ఒక గ్లాసు నిండా చల్లని నీళ్లు తాగాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. అన్ని పనులను పక్కన పెట్టి కొంత సేపు రిలాక్స్‌డ్‌గా ఉండాలి. వీలైతే కళ్లు మూసుకుని మెడిటేషన్ చేయాలి. వెంటనే తలనొప్పి తగ్గుతుంది.
కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఏమేం ఆహారం తింటున్నారో ఒకసారి పరిశీలనగా చూడాలి. తలనొప్పికి కారణమయ్యే ఆహార పదార్థాలను మానేయాలి.
తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి ?
తలనొప్పి రావడానికిక చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇతర జీవన విధానం కావచ్చు తలనొప్పిని పెంచి పోషిస్తూ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలలో ఈ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. నిజానికి క్లష్టర్ తలనొప్పి స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పార్శ్వపు తలనొప్పి ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. దీనికి ఆయా వ్యక్తుల అలవాట్లు, జీవన విధానాలే కారణం. ప్రతి రోజు ఒకటే సమయంలో వచ్చే ఈ తరహా తలనొప్పులను తగ్గించుకునేందుకు వైద్య విధానాలతో పాటు, జీవన విధానంలో మార్పులు కూడా ఎంతో ఉపకరిస్తాయి.పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ తెరను చూడడంవంటి అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి వెంటనే మెడిసిన్ను వాడకూడదు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. మద్యం బాగా సేవించే వారికి కూడా తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు మద్యానికి దూరంగా ఉండాలి. నిద్ర మరీ తక్కువైనా, బాగా ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి.
తలనొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
కొందరిలో ఒత్తిడి వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. అందువల్ల దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఐస్ క్యూబ్ తీసుకొని నుదిటి మీద పెట్టి మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది.స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. తలనొప్పి ఎన్ని గంటలపాటు ఉంటోంది అన్న దానిని బట్టి చికిత్స ఉంటుంది. తలనొప్పితో భాదపడేవారు మందులతో పాటు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం, ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం, యోగా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే తలనొప్పి ఎగిరిపోతుంది. దీంతో రిలాక్స్‌గా ఫీలవుతారు. తరచూ తలనొప్పి వస్తుంటే మాత్రం వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం ఉత్తమం.
తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం అన్నిరకాలుగా శ్రేయస్కరం.