చాలా మందిని వేధించి సమస్య నోటి దుర్వాసన. కొంతమంది ఉదయాన్నే శుభ్రంగానే బ్రష్ చేసుకున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నోట్లో నుంచి వెలువడే దుర్వాసన కారణంగా నలుగురితో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేం. పక్కనున్న వారితో దగ్గరగా కూర్చోని మాట్లాడాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఏయే ముందస్తు జాగ్రత్తలతో దీన్ని సులువుగా అరికట్టవచ్చు?
కొందరి నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. దీనికి చాలా కారణాలుంటాయి. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం ఇలా చాలా కారణాలుంటాయి. దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. నవ్వలేరు. అలాగే దుర్వాసన వల్ల పక్కన వారు చాలా ఇబ్బందిపడతారు. ఇలా నోటి దుర్వాసన చాలా రకాలుగా ఇబ్బందులను కలిగిస్తుంది. దానికి తోడు త్రేన్పుల ద్వారా కూడా కొన్ని సమయాల్లో దుర్గంధం వెలువడుతూ ఉంటుంది.
చాలా మంది నోరు తెరచి నిద్ర పోతూ ఉంటారు. ఈ సమస్య ఉందంటే నోటిలో బ్యాక్టీరియా అధికంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ లో ఎన్నో సమస్యలు కారణం అవుతుంది గనుక, నిద్రపోవడానికి ముందు పళ్ళు తోముకోవడం మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. చిగుళ్ళ సమస్య ఉండే వారు కూడా దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. కొంత మందిలో యాసిడ్ రిఫ్లక్స్ అనే సమస్య ఉంటుంది. కడుపులో ఉండే ఆమ్లాలు సరైన మార్గంలో ప్రయాణించకుండా తిరుగు మార్గంలో ప్రయాణించి గొంతు వరకూ వస్తాయి. ఇటువంటి వారి శ్వాసలో పుల్లటి వాసన ఉంటుంది. ఇది గొంతు, నోటికి కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలకు ఎక్కువ చేసే ఈ సమస్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
చిన్న సమస్యగా భావించే నోటి దుర్వాసన ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. పొట్టలో సమస్యలకు కారణమయ్యే హెచ్.పిలోరి అనే బ్యాక్టీరియా పెరుగుదల కొన్ని సమయాల్లో క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది. తీవ్రమైన దుర్వాసన దీని పెరుగుదలను తెలుపుతుంది. ఈ బ్యాక్టీరియాను నిరోధిస్తే ఈ సమస్యలు తగ్గడానికి ఆస్కారం ఉంది. కొన్ని రకాల మందులు తీసుకున్న వారిలో నోటి నుంచి అదే దుర్వాసన వస్తూ ఉంటుంది. నోటిని ఎంత శుభ్రం చేసుకున్నా, గొంతు ద్వారా వీటికి సంబంధించిన వాయువులు బయటకు వచ్చి వాసన తెలియజేస్తుంటాయి.
- గుండె, క్యాన్సర్, నిద్రకు సంబంధించిన మందులు గొంతులోనే ఎండిపోయి ఈ సమస్యను కలిగిస్తుంటాయి. విటమిన్ మందులు కూడా ఇలాంటి ఇబ్బందినే కలిగిస్తాయి.
- టాన్సిల్స్ లో ఆహార పదార్థాలు ఇరుక్కోవడం వల్ల కూడా కొన్ని సమయాల్లో దుర్గంధం రావచ్చు. ఇరుక్కున్న ఆహారం మీద బ్యాక్టీరియా పేరుకు పోవడం వల్ల అనేక ఇబ్బందులకు కారమం అవుతుంది.
- ఆహారం తీసుకున్న తర్వాత నోటి శుభ్రపరుచుకోవడమే దీనికి సరైన పరిష్కార మార్గం.
- శరీరం డీ హైడ్రేషన్ కు గురైనప్పుడు నోటిలో తగినంత లాలాజలం ఊరదు. దీని వల్ల కూడా దుర్గంధంతో కూడిన వాసన వస్తుంది. ఫలితంగా లాలాజల గ్రంథుల్ని ప్రభావితం చేసే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదురై దీర్ఘకాలంలో నోరు పొడిబారడానికి, చెడు శ్వాసకు కారణం అవుతాయి.
- నోటిలో గాయాలు కావడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఎదురౌతాయి. దంతాలకు, చిగుళ్ళకు సంబంధించిన పరిశుభ్రత పాటించక పోయినా ఈ సమస్యలు ఎదురౌతాయి. అందుకే నోటిని వీలైనంత వరకూ శుభ్రంగా ఉంచాలి.
- నోటిలో ఏవైనా దెబ్బలు తగిలితే రోజుకు రెండు మార్లు ఇప్పుడు నీటితో శుభ్రం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా నోటి దుర్వాసనను కొంతమేర తగ్గించుకోవచ్చు. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. నీరు బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
- నీరు తక్కువ తాగితే నోరు పొడిగా మారి దుర్వాసన వస్తుంది. అలాగే దంతాలను బాగా శుభ్రపరుచుకోవాలి. దంతాల్లో ఎక్కువ బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది. అందువల్ల రోజూ పళ్లను బాగా తోముకోవాలి.
- ఉదయం, రాత్రి వేళల్లో దంతాలను శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం భోజనం చేశాక కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి.
- ఎందుకంటే ఏ ఆహారం తిన్నా కూడా దానివల్ల మీ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆహారం తిన్న తర్వాత బాక్టీరియా నోటిలోనే ఉంటుంది. దానివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందువల్ల తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి.
టూత్ బ్రష్ ను రెగ్యులర్ మార్చుకుంటూ ఉండాలి. ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. టూత్ బ్రష్ నోటిలో బ్యాక్టీరియా ఏర్పడడానికి కారణం అవుతుంది. అందువల్ల, టూత్ బ్రష్ ని తరుచుగా మార్చడం అవసరం. రోజూ ఉదయం పళ్లు తోముకున్న తర్వాత నాలుకను బాగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే అక్కడ బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. నాలుకపై ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల రోజూ ఉదయం నాలుకను బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే రోజుకు ఒకసారి ఫ్లాసింగ్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. అయితే నోటి నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా ప్రమాదకరమైన సమస్యలు అని చెప్పలేం. కొన్ని సమయాల్లో సాధారణ సమస్యలు కూడా కావచ్చు. అందుకే ఈ తరహా ఇబ్బంది ఉంటే, వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.
నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ నోరు పొడిగా మారకుండా చూసుకోవాలి. భోజనం చేశాక నోటిని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారం బయటకు వచ్చేస్తుంది. దీంతో నోటి ఆరోగ్యం మెరుగవుతుంది. నోటి దుర్వాసన మాయమవుతుంది.