Health tips:జలుబు, జ్వరం, దగ్గా ? ఇలా ఉపశమనం పొందండి

By manavaradhi.com

Published on:

Follow Us
Natural Cold and Flu Remedies

ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు, జర్వం కామన్. చల్లని వాతావరణం, తేమతో నిండిన పరిసరాలు, జలుబు, దగ్గులను కలిగించే పలు రకాల సూక్ష్మక్రిముల వ్యాప్తికి, అలర్జీల వృద్ధికీ ఎంతో అనుకూలమైనవి. వీటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి.

దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా.. ముక్కులో గడబిడ ఉన్నా… క్రమంగా మనం నీరసించిపోతాం. ఎందుకంటే దగ్గు, జలుబు అనేవి మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి… దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తగ్గించెయ్యాలి.

సాధారణ జలుబు, దగ్గులతో మొదలై ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారి తీసి తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తాయి. ఈ ఇబ్బందులు తాత్కాలిక ఉపశమనాన్ని అందించే మందులతో అన్ని సందర్భాల్లోనూ అదుపు కాకపోవచ్చు. సమస్య కారణం ఆధారంగా చికిత్స తీసుకోవలసిరావచ్చు. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరాలను అంత తేలికగా తీసుకోకూడదు. వీటి మూలం ఎలర్జీలు అయి ఉండవచ్చు.

సీజన్ మారినప్పుడల్లా కొందరికి జలుబుతోపాటు దగ్గు కూడా వస్తుంటుంది. కొందరికి ఇతర కారణాల వల్ల కూడా ఎప్పటికప్పుడు దగ్గు వస్తుంది. అయితే దగ్గు రావడానికి కారణం ఏమైనా అది వచ్చిందంటే చాలు ఓ పట్టాన పోదు. దగ్గు అనేది నిజానికి వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల దగ్గు కారణాన్ని కనుక్కుంటే దగ్గుకు వైద్యం కనుకున్నట్లే అవుతుంది. జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, అలసట, వంటివి రెండింటిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు.

నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్దపెద్ద వైద్యాలూ, చికిత్సలేం అవసరం లేదు. అలాగని మలేరియా, డెంగీ వంటి జ్వరాలను నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. జలుబు అనేది ప్రధానంగా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్‌ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థ వీటిని గుర్తుంచుకుని పోరాడటం, వీటికి వ్యతిరేకంగా యాంటీబోడీలు తయారు చేసుకోవటం కష్టం. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది.

సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డం పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి.

జలుబు, జర్వం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అవి తిరిగి రావాలంటే కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్కసారి అది పెరిగిందంటే… ఇక వ్యాధిని తెచ్చే క్రిముల పని అయిపోయినట్లే. దగ్గు, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫీస్‌కి వెళ్లి పనులు చేయడం కంటే ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే ఒక్క రోజుతోనే అనారోగ్యం పరారవుతుందని డాక్టర్లు చెబుతున్నారు

ఫ్లూ జ్వరంలో గొంతు నొప్పి ఉంటే ఉండొచ్చు. రువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది. వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. చాలామందిలో ఈ లక్షణాలు రెండు మూడు రోజులు బాధించి, అవే తగ్గిపోతాయి. కాబట్టి ఒకటి రెండు రోజులూ పెద్ద చికిత్సలేం అక్కర్లేదు. ప్యారాసెటమాల్‌ మాత్రల వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే మూడు రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

సాధారణ జలుబు, దగ్గు కదా అని నిర్లక్ష్యం చేసినా, మందుల షాపుల్లో తోచిన మాత్రలు కొనుక్కుని వాడుతూ ఉండిపోయినా… ఈ ఇబ్బందులు తగ్గకపోగా, మరింత లోతుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా జ్వరం, ఇన్‌ఫెక్షన్లు మొదలైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఎక్కుడ రోజులు జలుబు, దగ్గు,జర్వం వేదిస్తుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment