భారత దేశ మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం జరిగింది. మన జీవనంలో, జీవితంలో ముఖ్య భాగమైన శ్రీరాముడి మందిరం ఆయన జన్మస్థలమైన అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కనులపండువగా శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగింది. ఇది మనమందరం గర్వపడాల్సిన సందర్భం. గొప్ప పర్వదినం.
శ్రీ రాముడు మన ఉనికి.
యావత్ భారత దేశానికే ఆయన ఉనికిగా నిలిచాడు…ఎలా అంటారా?
శ్రీరాముడు ఒక న్యాయబద్ధమైన, బాధ్యతాయుతమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు, విలువలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు. మనం శ్రీరాముడి జీవితసారాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకుంటే, ఆయన ఎంతటి ధర్మమూర్తో, ఆయన ఆచరించిన ధర్మం కాలానికి ఎలా అతీతమయినదో తెలుస్తుంది. రామాలయం లేని గ్రామం ఉండదు. రాముడు లేని లోగిలి లేదు.. రాముడు లేని అంగిలి లేదు. లోగిలి అంటే ఇల్లు. అంగిలి అంటే నోటిలో పై భాగం. మీరు జాగ్రత్తగా గమనిస్తే నోటిలోని పైభాగం- నాలుక ఈ రెండింటి మధ్య నుంచి రామ శబ్దం వస్తుంది. రాముడిని కొలవని ఇల్లు ఉండదు. రాముడిని తలవని మనసు ఉండదు. రామ శబ్దం పలకని నోరూ ఉండదు. యుగయుగాలు గడిచిపోయినా రాముడి తలంపు రాని క్షణం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలోని ప్రతి క్షణమూ రామ మయయే. ప్రతి శ్వాసలోనూ, దేశంలోని ప్రతి భాషలోనూ శ్రీరాముడే కొలువై ఉన్నాడు.
ఒకప్పుడు అమ్మ తన శిశువుకు స్నానం చేయించేటప్పుడు చెప్పే మాట “శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.”
బాలరాముడితో గోరుముద్దలు తినిపించడానికి కౌసల్య మాత పాటించిన చిట్కానే అనుసరిస్తూ ప్రతి తల్లీ తన ముద్దుల బిడ్డలతో చందమామ రావే జాబిల్లి రావే అంటూ మురిపాల ముద్దలు గుటుక్కుమనిపించేస్తుంది. ప్రతి బిడ్డలోనూ ప్రతి తల్లీ రామయ్యేనే చూస్తుంది. నిద్రముంచుకొచ్చి ఎలా నిద్రపోవాలో తెలియక గుక్కపట్టి ఏడ్చే శిశువులను జో కొట్టడానికి తల్లులు పాడే పాట “రామాలాలీ – మేఘశ్యామా లాలీ”. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అప్రయత్నంగా వచ్చే మాట – “అయ్యో రామా”! వినకూడని మాట వింటే అనే మాట ‘‘రామ రామ’’తప్పేమీ మాట్లాడలేదు, తప్పేమీ చేయలేదు అని సమర్థించుకోవడానికీ వాడే పలుకుబడీ ‘రామ రామ’ ‘‘అన్నమో రామచంద్రా’’ అని వేడుకుంటే అన్నం దొరుకుతుందన్న విశ్వాసం! ఒక మంచి వ్యక్తిని గురించి పరిచయం చేయడానికి వాడే విశేషణం ‘‘రాముడు మంచి బాలుడు’’. మాట జవదాటని వారి గురించి చెప్పే విశేషణం ‘‘రామబాణం’’.
ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఏ వ్యక్తిలో అయినా కొన్ని సుగుణాలను మాత్రమే చూస్తాం. కొన్ని బలహీనతలుంటాయి. కానీ శ్రీ రాముడు మాత్రం సకల సద్గుణ సంపన్నుడు. అందుకే ఆయన ఇంటింటి ఇలవేల్పు అయ్యాడు. శ్రీరాముడు ఆదర్శాలు వల్లె వేయలేదు. ఆచరించి చూపించాడు. ఒక కుమారుడిగా, ఒక శిష్యుడిగా ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక అతిథిగా, ఆఖరుకు ఒక శత్రువుతో కూడా ఎంత ఆదర్శంగా ఉండాలో ఆచరించి చూపించిన పురుషోత్తముడు. ఆయన్ను ఒక పాలకుడిగా, ఒక మనిషిగా భావించి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే తప్ప ఆయన గొప్పతనం అర్థం కాదు. ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా… ఇలా ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపిన వాడు. ఆయన జీవించిన కాలంలో అధికారం కోసం స్వార్థచింతన, బహుభార్యాత్వం సాధారణ విషయాలు.
సువిశాల సామ్రాజ్యానికి కాబోయే సమ్రాట్. తెల్లవారితే పట్టాభిషేకం. అంతలోనే పిడుగులాంటి వార్త. పినతల్లికి తన తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్లిపోయాడు రాముడు. దశరథుడు రాముడిని అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించిన సందర్భంలో ‘‘మాట తప్పని వ్రతం వల్ల నిన్ను అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించాను. నన్ను ఎదిరించి, యుద్దం చేసి, నన్ను ఓడించి, నా కళ్ళ ముందే తిరిగి రాజ్యపాలన చెయ్యి. వృద్ధుణ్ని గనుక నీ చేతిలో నేను సులభంగా ఓడిపోతాను. ఈ విషయంలో నేనేమీ అనుకోను. ఆనందపడతాను’’ అని బ్రతిమిలాడాడంటే, ఆ కోరిక తీరక అసువులు బాసాడంటే, పితృవాక్యపరిపాలనకు కట్టుబడిన కొడుకుగా రాముడు ఎంత గొప్పవాడు అయ్యి ఉండాలి. మహా పరాక్రమవంతుడైన రాముడు తలచుకుంటే ఆయనే సమ్రాట్. కానీ సామ్రాజ్య పరిపాలకుడిగా కాదు…పితృ వాక్య పరిపాలకుడిగా నిలిచిపోయాడు. ఏకపత్నీవ్రతం అనే భావనే తెలియని రోజుల్లో ఒక వ్యక్తికి ఒకరే భార్య అన్న ఆదర్శాన్ని పరిచయం చేసి, పాటించాలంటే ఎంతటి గొప్ప సంస్కారవంతుడయి ఉండాలి? ‘‘తనువులు రెండు తామొకటేఅయిన సీతారాములు..’’ అంటూ ఒక సినీ కవి సీతారాముల ఆదర్శదాంపత్యాన్ని వర్ణించారు.
శ్రీరాముడు సరే.. తండ్రి మాటను నిలబెట్టడానికి కారడవులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. సీతామాతకు ఏం అవసరం? జనకమహారాజు గారాల పట్టి. హంసతూలికా తల్పాల మీద సేద తీరిన రాజపుత్రిక. అటువంటి భోగ భోగ్యాలనూ త్యజించి రాముడు వద్దు వద్దని వారిస్తున్నా వినకుండా శ్రీరామ సన్నిధే తనకు స్వర్గమని ఆయనతో పాటు అడవులకు వెళ్లిపోయిందంటే శ్రీరాముడు ఎంతటి ఆదర్శవంతమైన భర్తగా ఉండి ఉండాలి? ఎంత గొప్ప ఆదర్శం ఆ దంపతులది. అందుకే నూతన వధూవరులను ఆశీర్వదించేటప్పడు సీతారాముల్లా ఆదర్శంగా ఉండాలని దీవిస్తారు. అన్న కోసం ముగ్గురు తమ్ముళ్ళు రాజ్య సుఖాలు త్యాగం చేసి అడవులకు వెళ్ళడానికి సిద్ధపడ్డారంటే, అన్న మాటను జవదాటకుండా, రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని తమ్ముళ్లు పరిపాలించారంటే అన్నగా రాముడు వారి హృదయాల్లో ఎలాంటి ముద్ర వేసి ఉంటాడు.
రాముడు అడవికి వెళతున్నాడని తెలిసి ప్రజలంతా ఆయన తోటి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే, రాముడు మాత్రమే తమకు రాజుగా కావాలని తపించారంటే రాముడి వ్యక్తిత్వం ఎలాంటిది అయ్యి ఉంటుంది.
కారుణ్యమూర్తి అంటే శ్రీరాముడే. తాను ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప వారసుడైనప్పటికీ సకల వర్ణ, సకల జనులతోనూ, సకల జీవజాతులతోనూ ఎంతో ఆపేక్షతో, ఎంతో కరుణతో, ఎంతటి ఆత్మీయతతో వ్యవహరించాడు…
ఒక పక్షి శ్రీరాముడి భార్యను కాపాడేందుకు ప్రాణాలు ఇచ్చిందంటే శ్రీరాముడు ఎంతటి ప్రాణిదయ కలవాడు అయ్యి ఉండాలి? ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండలేని కోతి మూక ఒక్క మనిషి కోసం దండుగా కదిలిందంటే నియంత్రణలో, శిక్షణ ఇవ్వడంలో శ్రీరాముడు ఎంత గొప్పవాడయ్యి ఉండాలి? వానరులు, గిరిజనులు…ఇలా ఎవరితోనూ రామయ్య తారతమ్యాలు చూపలేదు. అందరిలోనూ ఉత్కృష్టమైన జీవచైతన్యాన్ని చూశాడు. వారందిరినీ సమభావనతోనే ఆదరించాడు. ఇది కదా ఆదర్శమంటే. ఇది కదా రామరాజ్యమంటే. కుల, మత, ప్రాంత, జాతి వైషమ్యాలను రెచ్చగొట్టే నేటి రోజుల్లో శ్రీరాముడిలా రాజనీతిజ్ఞత ఉన్న నేతలు కదా మనకు కావాల్సింది.
ఒకరి గుణగణాలను వివరించడానికి ఉపమానాలు వాడతాం. సాపేక్షంగా వివరిస్తాం. మరో వస్తువుతోనూ, వ్యక్తితోనో, మరో జీవితో పోలుస్తాం. కానీ శ్రీరాముడి గురించి వివరించేటప్పడు ఈ సమస్త ప్రపంచంలో ఏదీ పోలికకు రాదు. రాముడికి రాముడే సాటి. ఆయనను ఆయనతోనే పోల్చాలి. అదీ శ్రీ రాముడి వ్యక్తిత్వం. రాముడి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఒకటే మాట-ఒకరే భార్య- ఒకటే బాణం’’.
శ్రీరాముడి వ్యక్తిత్వం ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. ఆయన పూర్వ భాషి, మిత భాషి, ప్రియభాషి అని వాల్మీకీ మహర్షి చెప్పారు. ఎవరైనా ఎదురుపడినప్పుడు వారే ముందు పలకరించాలని అహానికి పోకుండా రాముడే ముందు పలకరిస్తాడు. అలాగని ఎక్కువ మాట్లాడడు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. ఆ మాటల్లోనూ ప్రియమే కనిపిస్తుంది. అంటే చక్కని మాటలే మాట్లాడతాడు తప్పించి నొప్పించే మాటలు మాట్లాడడు. ఇటువంటి వ్యక్తులను ఇష్టపడని వారెవరుంటారు. అందుకే శ్రీరామ చరిత్ర ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం.
శ్రీరాముడిని శత్రువుగా భావించిన రావణాసురుడు వాస్తవానికి రాముడికి ఎందులోనూ తక్కువకాదు. సకల విద్యలు తెలిసిన గొప్ప పండితుడు. పరమేశ్వరుని కృప పొందినవాడు. అపార సంపన్నుడు. మహాపరాక్రమవంతుడు, అందగాడు. కానీ రాముడికి, రావణుడికి మధ్య తేడా ధర్మమే. రాముడు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటే, రావణుడు అధర్మాన్ని ఆచరించాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. రావణుడు అసురుడయ్యాడు. మాతృభూమిపై రాముడికి ఉన్న ప్రేమను వర్ణించలేము. రావణ వధ తరువాత అయోధ్యకు బయలుదేరే సమయంలో లక్ష్మణుడు రాముడితో లంకలోనే ఉండిపోదామని అన్నప్పుడు.. శ్రీరాముడు ‘అపిస్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని చెప్పాడు. సువర్ణమయమైనప్పటికీ.. లంకా నగరంలో ఉండటం నాకు రుచించదు. జన్మభూమిని మించిన స్వర్గము మరొకటి ఉండదంటూ మాతృభూమి విశిష్టతను శ్రీరాముడు తెలియజెప్పాడు. ఉపాధి అవకాశాల కోసం ఏదేశమేగినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. నీకు జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకోవడానికి నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే సందేశాన్ని రాముడి జీవితం మనకు వినిపిస్తుంది.
జీవితంలో ఎప్పుడూ విజయాలు సాధించేవారిని, ఐశర్యవంతులను, అధికారంలో ఉన్నవారిని ఆరాధించడం మానవనైజం. కానీ శ్రీరాముడి జీవితం చూస్తే అన్నీ కష్టాలే. సూర్యోదయంతోనే మహాచక్రవర్తి కావాల్సిన వాడు నారబట్టలు కట్టుకుని అరణ్యానికి పోవాల్సి వచ్చింది. ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య అపహరణకు గురయింది. వద్దనుకున్న యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కానీ ఆదర్శపురుషుడయ్యాడు. ఎందుకంటే.. ఆయన పరిస్థితులను ఎదుర్కొన్న తీరు, ఏ పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పని నిగ్రహం. వైఫల్యాల్లోనూ ఎంత గొప్పగా, ఆదర్శవంతంగా జీవించవచ్చో చూపించిన పురుషోత్తముడు రాముడు.
రాముని ధర్మ నిరతి నాటికీ, ఏ నాటికీ అందరికీ ఆదర్శప్రాయమే. స్వార్థానికీ, ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణే మానవ జీవితం. స్వార్థాన్ని త్యజించి, ధర్మాన్ని అనుసరించే మానవుడు మాత్రమే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలడు. అందరి మన్ననలను పొందగలడు. ఆకర్షణలు, ఆటంకాలు ఎదురైనా శ్రీరాముడు ఏ నాడు ధర్మం తప్పి ఎరుగడు. రాముని కథ చుట్టూ ఎన్నో వాదాలు, వివాదాలు ఉన్నప్పటికీ, రామరాజ్యమే కావాలని, రాముడి లాంటి పాలకుడు కావాలని మనమంతా కోరుకుంటాం. దీనంతటికీ కారణం రాముడు ధర్మమార్గంలో పరిపాలించడం ఒక్కటే కారణం. రాముని జీవితం నుంచి, రాముడి 16 సుగుణాల నుంచి ఈ తరం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కొడుకుగా, శిష్యునిగా, అన్నగా, భర్తగా, పాలకుడుగా, స్నేహితుడిగా రాముడు పాటించిన ధర్మ మార్గాలను అర్థం చేసుకుని ఆయన బాటలో ముందుకు సాగేలా ప్రయత్నిస్తే చాలు. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే యశస్సు మన సొంతం అవుతుంది.
భారత దేశంలోనే కాదు, ఆగ్నేయాసియాలో జావా, బాలి, మలయా, బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్ తదితర చోట్ల కూడా శ్రీరామ చరిత అక్కడి ప్రజల సంస్కృతిలో భాగమయిపోయింది. ఇలా మన అస్తిత్వం అయిన శ్రీరామచంద్రమూర్తికి అయోధ్యలో నిర్మించిన మందిరం ఈ నెల 22న అంగరంగవైభవంగా ప్రారంభం కావడం మన దేశానికి ఎంతో శుభసూచికం. శ్రీరామరాజ్య స్ఫూర్తితో సుపరిపాలనను మరింత పరిపుష్ఠం చేసుకోవడానికి ఇది గొప్ప శ్రీకారం కాగలదని విశ్వసిస్తున్నాను. ప్రజలందరూ శ్రీరాముడు ఆచరించి చూపించిన ఆదర్శాలను పాటిస్తే చిరకాలంలోనే ప్రపంచంలోనే శక్తిసంపన్నమైన దేశంగా భారత్ అవతరించగలదు.
శ్రీరామ రక్ష.. సర్వజగద్రక్ష