భద్రాచలం పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం… సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం! ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు. రామ నామం జపించిన చాలు ముక్తిమార్గం కలుగుతుంది.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలంకు సమీపంలో భద్రిరెడ్డిపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ పోకల దమ్మక్క అనే భక్తురాలు శ్రీరాముడిని అంచెంలమైన భక్తితో నిత్యం కొలుస్తుండేది. ఆ భక్తికి మెచ్చిన శ్రీరామ చంద్రుల వారు ఒక రోజు కలలో ఆమెకు దర్శనం ఇచ్చి … తాను భద్రగిరిపై కొలువై ఉన్నానని .. మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాటు చేయ్యమని.. ఇందుకు నీకు మరో రామ భక్తుడు సాయం చేస్తాడని దమ్మక్క కు ఆదేశించారట శ్రీరాముల వారు. దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ చిన్న పందిరి నిర్మించి శ్రీ సీతారామ చంద్రస్వామి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. కొంతకాలం తర్వాత కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.
ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు… తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉండే.. పర్ణశాలలో.. రామాయణ కాలంలో శ్రీరాముడు.. సీత.. లక్ష్మణుడున్న పర్ణశాల.. రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ.. జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకొనే ఆధారాలు చూడొచ్చు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఎంతో కన్నులపండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ద నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికి ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. సీతారాముల కళ్యాణమహౌత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.