ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆదివారము, తేది. 15.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు.
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాత్రిపుర సుందరీ దేవి.
ఈరోజు శ్రీబాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారికి లేత గులాబీ రంగు లేదా పసుపురంగు చీర కడతారు. అమ్మవారికి ఎరుపు రంగు మందార పూవులతో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పులిహోర, పరమాన్నం నైవేద్యం పెడతారు. ఈరోజు రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు పదేళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలు పెడతారు.