ఈయాడాది సొంతగడ్డపై జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రధాన ఆయుధం హార్దిక్ పాండ్యా అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్య ఆటతీరే అందుకు కారణం. గత కొద్దికాలంగా అతను బౌలింగ్, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ మళ్లీ జట్టుకు వెన్నెముకగా మారాడు. ఆసియా కప్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు క్రీడాభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ టోర్నీలో రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన హార్దిక్ 46 సగటుతో 92 పరుగులు రాబట్టాడు. మరీ ముఖ్యంగా మన దాయాధి పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరులో జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో 90 బంతుల్లో 87 పరుగులతో టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది కానీ ఇందులో హార్దిక్ బ్యాటింగ్ మాత్రం గొప్పగా ఆకట్టుకుంది. ఇక బౌలింగ్‌లో 4 ఇన్నింగ్స్‌లో 11.33 సగటుతో 6 వికెట్లు పడగొట్టాడు. వికెట్లు తీయడంతో పాటు పరుగులూ కట్టడి చేస్తున్నాడు. అతని ఎకానమీ 3.34గా ఉందంటే హార్దిక్ ఎలాంటి ఫౌమ్ లో ఉన్నాడో మనకు ఇట్టే అర్థం అవుతుంది. శ్రీలంకతో ఫైనల్లో మూడు వికెట్లతో లోయర్ ఆర్డర్ వెన్ను విరిచాడు.
అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.