Draksharamam – దక్షిణ కాశీ “ద్రాక్షారామం” మహిమాన్వితం…!

By manavaradhi.com

Published on:

Follow Us
Draksharamam

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.‘కాశ్యాం తు మరణాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే..’ .. భీమేశ్వరుడు నిండుగా కొలువుదీరిన ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ శ్లోకానికి ‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రరాజం పౌరాణిక గాథల్లో అభివర్ణితమైంది. పంచారామాల్లో ఒకటిగా భక్తకోటి పూజలందుకుంటోంది.

తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా- అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలేపంచారామాలని ఓ ఐతిహ్యం ఉంది. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలందుకొంటున్నాయి.

ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లో లేని విశేషాలు ద్రాక్షారామానికి ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లోనూ, అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి సప్తగోదావరి పుష్కరిణిలో స్నానం చేసి, మాణిక్యాంబ సమేతుడైన భీమేశ్వరస్వామిని దర్శిస్తే, సాంబశివుడు సర్వపాపాల్నీ హరింపజేస్తాడని భక్తుల విశ్వాసం. కారుణ్య మూర్తి అయిన కనకసభాపతి కామితార్థాలను అనుగ్రహిస్తాడని ధార్మికుల నమ్మకం. భీమేశ్వరుడులాంటి దైవం, దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం, సప్తగోదావరిని పోలిన తీర్థరాజం.. జగత్తులో లేవని స్కాందపురాణం చెప్తోంది.

ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకుడు కావడం విశేషం. హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరనీ, ఇరువురికీ పూజాదికాలు సరిసమానంగా అర్పించాలనీ ద్రాక్షారామంలోని కల్యాణోత్సవాలు చెప్పక చెబుతాయి. అర్ధశరీరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికీ, హృదయేశ్వరిని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున వేదికపై కల్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం. శైవులకూ, వైష్ణవులకూ ఇవి నేత్రపర్వం చేస్తాయి. ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, ఢుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చతుర్మఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర చండీశ్వరాది దేవీదేవతామూర్తులూ కొలువుదీరి ఉంటారు.

Leave a Comment