పగలంతా పనిచేసిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళు లాగుతూ.. కాస్త ఎవరైనా నొక్కితే బాగుండును.. అని అనిపిస్తోందా? ఇది అవిశ్రాంత జీవన పోరాటంలో మన శరీరము అలసి తనలో వస్తున్న మార్పుని సూచించే మొదటి ప్రక్రియ కాళ్ళు లాగుతున్నాట్లు అనిపించడం . ఇది సహజమే అయితే నిద్రలో కాళ్లను విపరీతంగా కదుపుతుండటం ఎందుకు జరుగుతుంది..?
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్.. పైకి చెప్పికోదగ్గ బాధ కాదు. కాని మనల్ని, మన మనస్సుని చికాకు పరిచే ఒక ఫీలింగ్. ఒక చురుకుమనే బాధ లాంటి అనుభూతి. పడుకోనివ్వదు. తగ్గేదాకా నిద్రపోనివ్వదు. ఆగనివ్వకుండ కాళ్ళు కదపాలనే తొందరపెడుతుంది. నిద్రలో కాళ్లూ, చేతులూ ఎక్కువగా కదిలిస్తుంటారు. నాడీ సంబంధమైన సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. కొందరు ఊరకనే కూరోని కాళ్ళు ఊపుతారు. ఇది వాళ్లు కావాలని చేయరు. అదొక తెలియని అలవాటు. కాళ్ళలో బిగపట్టినట్లుండడం, తిమ్మిరిగా ఉండడం లాంటివి వల్ల కాల్ళు ఊపుతుంటారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు త్వరగా నిద్రాపోవటానికి బాగా కష్టపడతారు. ఇది 5-10 శాతం మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణమైన స్థితిగా పేర్కొనవచ్చు,
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్.. పురుషుల్లో కంటే మహిళలను ఎక్కువగా వేధించే నాడీ సంబంధిత రుగ్మత ఇది. పట్టుమని పది నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోవడం.. కాళ్లు అటూ ఇటూ కదిలిస్తుండడం.. అటూ ఇటూ తిరిగి పడుకుంటూ కాళ్లు ముడుచుకోవడం వంటి లక్షణాలు కూర్చొని పనిచేసే వాళ్లలో చాలామటుకు కనిపిస్తాయి. కాళ్లు కదిలించకుంటే ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాళ్లు లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు కదిలించగానే తగ్గిపోతుంది. మళ్లీ కొద్ది సేపటికి మొదలవుతుంది. తేలికగా నిద్రపట్టదు. ఐరన్ లోపం, శరీరంలో డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా ఈ సమస్య వచ్చే అవకాశమున్నట్లు వైద్యులు చెప్తున్నారు. కిడ్నీ సమస్యలు, మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులున్నవారిలో రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ సిండ్రోమ్ నుంచి బయటపడేందుకు ముందుగా కాళ్ళు కదలిక ఆపడం అలవాటు చేసుకోవాలి. నిద్ర చక్కగా పట్టేటట్లు చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వులనూనె మర్ధన చేసుకొవాలి. బెడ్రూంను ఆహ్లాదకరంగా ఉంచుకోవడం, టి.వి. కంప్యూటర్లకు రాత్రుల్లో దూరంగా ఉండడం, నిద్రపోయే ముందు వేడి నీళ్ళ తో స్నానం చేయడం మంచిది. టొమాటోలు , మిరియాలు , మసాలా వస్తువులు , గుడ్లు తక్కువగా తినడం మంచిది. నీరు ఎక్కువగా త్రాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఐరన్ మాత్రలు , బి.కాంప్లెక్స్ మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కాఫీలు, ఆల్కహాల్, పొగాకు ఉత్పతత్తుల వినియోగాన్ని తగ్గించాలి.
కండరాలు, వాటిల్లోని నాడుల్లో సమస్యల కారణంగా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నట్లు తేలితే మెగ్నీషియం, పొటాషియం అందేలా ఆహారాలు తీసుకోవాలి. అలాగే శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కంటినిండా నిద్రపోయేలా జాగ్రత్త పడటం చాలా అవసరం.







