దంత ఆరోగ్యానికి టూత్ బ్రషింగ్ కీలకపాత్ర వహిస్తుంది. నోటి శుభ్రత తో దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రషింగ్ టెక్నిక్స్ తెలుసుకోకుండా బ్రషింగ్ చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి మనం టూత్ బ్రష్ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం.
నోటి ఆరోగ్యమే మన ఆరోగ్యానికి మూలం. అందుకే ఎప్పుడూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని శుఃరంగా ఉంచుకోవాలంటే ప్రతి రోజూ బ్రషింగ్ తప్పనిసరి. రోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. బ్రషింగ్ చేసేటప్పుడు 2, 3 నిమిషాల కంటే ఎక్కువసేపు చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అయితే బ్రషింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్లపై బలంతో బ్రష్ నొక్కి పెట్టి కాకుండా తక్కువ ఒత్తిడితో చేసుకోవాలి. అధిక ఒత్తిడితో చేయడం వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర ఎనామిల్ అరిగిపోతుంది. చిగుళ్ళు దెబ్బతింటాయి. ఎనామిల్ పొర అరిగిపోతే వేడి, చల్లటి, పుల్లటి వస్తువులు తీసుకున్న సమయంలో పళ్లు జివ్వున లాగుతుంటాయి. దీన్నే సెన్సిటివిటీగా చెబుతారు. అయితే ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించడం వల్ల దంత సంరక్షణ సాధ్యమవుతుంది. బ్రష్ చేయడానికి కూడా ఒక విధానం ఉంది. బ్రష్ పట్టుకుని పై నుంచి కిందికి, కింది నుంచి పైకి బ్రష్ చేసుకోవాలి. అలా కాకుండా అడ్డదిడ్డంగా బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. పళ్ల మధ్య సందులు ఏర్పడతాయి. దీంతో తిన్న ఆహారం ఇందులో ఇరుక్కొని ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే రోజులో రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. పళ్లపై గార బాగా పేరుకుపోతే అనేక సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
చిగుళ్లపై బ్రష్ ను 45 డిగ్రీల కోణంలో ఉంచి పట్టుకోవాలి. నోటిలోపల దవడ పళ్లకు బయటి భాగంలో బ్రష్ ను ఉంచి కింది వైపు నుంచి పై వైపునకు వచ్చేలా బ్రష్ చేయాలి. లోపలి వైపు నుంచి చేసే సమయంలోనూ ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది.అలాగే నాలుకను కూడా ఓసారి బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నాలుకపైనే ఎక్కువగా ఉంటుంది. బ్రష్ చేయడం వల్ల అది తొలగిపోతుంది. దంతాలు చర్మంతో అనుసంధానమయ్యే చోటే బ్యాక్టీరియా నిల్వ ఉండే స్థావరం. సాధారణంగా బ్రష్ చేసే సమయంలో బ్రష్ బ్రిస్టల్స్ ఈ ప్రాంతంలోకి వెళ్లవు. ప్రత్యేకంగా మనమే ఓపికతో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా బ్రష్ చేసుకోవడం సాధ్యం కాకపోతే తిరిగి బ్రష్ చేసుకునే వరకు నోటిని నీటితో పుక్కిలించి ఆ నీటిని వదిలివేయాలి. అప్పుడప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం మంచిది. బ్రష్ హార్డ్ గా ఉండకుండా చూసుకోవాలి. సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ ను ఎంచుకోవాలి. బ్రిస్టల్స్ రంగు మారినా, వంగిపోయినా, బ్రష్ వాడకం మొదలు పెట్టి మూడు నెలలు దాటిపోయినా బ్రష్ మార్చడం మంచిది.
దంత సంరక్షణకు రోజూ బ్రష్ చేసుకోవడం ఎంత అవసరమో ఫ్లాసింగ్ కూడా అంతే అవసరం. ఫ్లాసింగ్ అన్నది దంతాలపై ఏర్పడుతున్న గారను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. పళ్ల మధ్యలో ఇరుకున్న ఆహార పదార్థాలను తొలగించడం దీంతో సాధ్యపడుతుంది. ప్రతీ రోజూ రాత్రి నిద్రకు ముందు ఫ్లాసింగ్ చేసుకోవడం ద్వారా పళ్లు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్యలో ఉన్న ఆహార పదార్థాలు, చెడు పదార్థాలు తొలగిపోయి, పళ్లు పుచ్చిపోకుండా నివారిస్తుంది. అలాగే చిగుళ్లు వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది. అన్నీ వయసులవారు దీన్ని అలవాటు చేయాలి.








