అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆయా పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది.
బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.
వైకాపా పిటిషన్ కొట్టివేత
‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే వార్డుల పునర్విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పైనా న్యాయస్థానం ఇదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలపై స్పష్టత ఏర్పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.






