ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానంటే..? మనసులో జరిగిన సంఘర్షణను బయటపెట్టిన సోనియా గాంధీ!

By manavaradhi.com

Published on:

Follow Us
Belonging A Journey of Love

న్యూఢిల్లీ: 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నిరాకరించడానికి గల కారణాలను కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు. ఆ సమయంలో తన మనసులో జరిగిన సంఘర్షణ, కుటుంబ సభ్యుల ఆందోళన, పార్టీ నేతల ఒత్తిడి వంటి అంశాలను తన ఆత్మకథలో వివరించారు. ప్రధాని పదవిని స్వీకరించాలా వద్దా అనే విషయంలో తాను తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు పేర్కొన్నారు.

సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ (Belonging: A Journey of Love) పుస్తకం మంగళవారం విడుదలైంది. తన జీవిత ప్రయాణం, కుటుంబంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు, రాజకీయాల్లో ఎదుర్కొన్న సవాళ్లు, కాంగ్రెస్‌ పార్టీలో పోషించిన పాత్ర వంటి అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన సందర్భానికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా వెల్లడించారు.

ప్రధాని పదవి వద్దని ముందే నిర్ణయించుకున్నా!

2004 ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని తన పిల్లలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా ముందుగానే చెప్పినట్లు పేర్కొన్నారు. తన అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్‌ గాంధీ హత్యలను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో.. తాను ప్రధాని కావడం తమ కుటుంబానికి ప్రమాదకరమని పిల్లలు భావించారని వివరించారు.

అయితే, ఎన్నికల సమయంలో తన వ్యక్తిగత నిర్ణయాన్ని పార్టీ నేతలకు గానీ, ప్రజలకు గానీ వెల్లడించలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ ఐక్యతను కాపాడటంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. నాయకత్వంపై అనవసర చర్చలు జరిగితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందని భావించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సమయంలో తన ముందున్న పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని సోనియా గుర్తుచేసుకున్నారు. ప్రధాని పదవిని చేపట్టకూడదనే నిర్ణయంపై తాను దృఢంగా ఉన్నప్పటికీ.. తన నిర్ణయం పార్టీ నేతలను బాధపెడుతుందనే ఆందోళన కూడా ఉండేదన్నారు.

పార్టీ నేతల ఒత్తిడి.. పిల్లల్లో ఆందోళన

యూపీఏ కూటమి నేతలంతా తన నివాసంలో సమావేశమైనప్పుడు దాదాపు గంటపాటు చర్చ జరిగినట్లు సోనియా తెలిపారు. ఆ తర్వాత ప్రధాని పదవిని చేపట్టడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసినా.. నేతలు అందుకు అంగీకరించలేదన్నారు. తమ చుట్టూ చేరి నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు.

ఆ సమయంలో ప్రియాంక గది బయటే ఉన్నారని, తాను ప్రధాని పదవికి అంగీకరించినట్లు తెలుసుకున్న వెంటనే పరుగున వెళ్లి రాహుల్‌కు ఈ విషయం చెప్పారని గుర్తుచేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ తన వద్దకు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారని, ఆ సమయంలో ప్రియాంక కళ్లు ఎర్రబడటం ఇప్పటికీ తనకు గుర్తుందని పేర్కొన్నారు.

ఆ రోజు రాత్రి తన మనసులో తీవ్ర సంఘర్షణ జరిగిందని సోనియా వెల్లడించారు. ఆ సమయంలో తన భర్త రాజీవ్‌ గాంధీ పక్కన ఉంటే బాగుండేదని అనిపించిందన్నారు. ప్రధానమంత్రి పదవిని చేపడితే తన విదేశీ మూలాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులు వివాదాలు సృష్టించే అవకాశం ఉందని భావించినట్లు చెప్పారు.

ఒకవైపు దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గుర్తుకొస్తుంటే.. మరోవైపు దేశానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచన తనను వెంటాడిందన్నారు. చివరకు తన మనసు చెప్పిన మాటకే ప్రాధాన్యమిస్తూ ప్రధాని పదవిని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

అందుకే మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించా

మరుసటి రోజు జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూతన నిర్ణయాన్ని ఎంపీలకు స్పష్టం చేసినట్లు సోనియా తెలిపారు. మొదట ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. చివరకు తాను ప్రధాని పదవిని చేపట్టబోనని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించినట్లు వెల్లడించారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని, పార్టీలోని ఏ వర్గానికీ ప్రత్యేకంగా మద్దతుదారుగా లేకుండా తటస్థంగా వ్యవహరించగలరని భావించినట్లు వివరించారు.

అంతేకాకుండా, యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్ష పార్టీలు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాయని నమ్మినట్లు చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం తనకు ఉందని సోనియా గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించి మన్మోహన్‌ సింగ్‌కు ఆ అవకాశం కల్పించిన వెనుక ఉన్న వ్యక్తిగత, రాజకీయ కారణాలను ఈ పుస్తకంలో సోనియా వివరించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Leave a Comment