14 ఏళ్లైనా మారని గుర్తింపు.. పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారంటూ రేణు దేశాయ్ ఆవేదన!

By manavaradhi.com

Published on:

Follow Us
Pawan Kalyan and Renu Desai

Renu Desai :నటి రేణు దేశాయ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే తనను చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితం, విడాకుల తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మనసులోని మాటలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగు వారందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ‘బద్రి’ సినిమాతోనే నా జీవితం ప్రారంభమైందని చాలామంది భావిస్తున్నారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితమే లేనట్టుగా చూస్తున్నారు. మాకు విడాకులు జరిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’’ అంటూ ప్రశ్నించారు.

విడాకుల తర్వాత తన కెరీర్‌లో సాధించిన విజయాలను కూడా ఆమె గుర్తుచేశారు. ‘‘2012లో విడాకులు మంజూరైన తర్వాత ఓ మరాఠీ సినిమాను నిర్మించాను. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాను. డ్యాన్స్ షోలకు పనిచేశాను. కవితలు రాశాను. ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఈ అవకాశాలన్నీ నాకు ఎలా వస్తాయి?’’ అంటూ తన ప్రతిభను వివరించారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపైనా రేణు దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను ఓ కుక్కను కాపాడినా నన్ను విమర్శిస్తున్నారు. ఆయన లేకపోతే ఆమెకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, వ్యక్తిత్వం ఉన్నప్పటికీ.. గత జీవితాన్నే పదేపదే ప్రస్తావిస్తూ తనను ఒకే కోణంలో చూడటంపై రేణు దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Comment