ఆశ్వయుజ శుద్ధ తదియ, మంగళవారము, తేది. 17.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీఅన్నపూర్ణా దేవి గా దర్శనమిస్తారు.
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు. శ్రీఅన్నపూర్ణాదేవి గా అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణా దేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీఅన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము, ఆమె దర్శనము సర్వ పుణ్యప్రదాయకము. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.
ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.