ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. భక్తులు కోరినవారికి .. కోరినట్టుగా వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గమ్మగా ప్రసిద్థి చెందింది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అమ్మవారి శక్తీ పీఠములలో ఈఆలయం ఒకటి.. ఇక్కడి అమ్మవారు స్వయంభుగా వెలసారని పురాణాలు చెబుతున్నాయి.
దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన తర్వాత.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది. మహారౌద్రంగా వున్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేసారు. అప్పట్నుంచీ అమ్మ పరమశాంతస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు.
పూర్వం మహా భారత కాలంలో పాండవ మధ్యముడు పాశుపతాస్త్రమును సంపాదించటానికి ఇంద్రకీలాద్రిపై తపమొనరించి నాడట. అందుచేత విజయమును సాధించిన అర్జునిడి నామములలో విజయుని పేరు సార్ధకనామంగా విజయవాడగా రూపొందినదని భావము. ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరిగే కృష్ణ పుష్కరోత్సవములను లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దసర తొమ్మిది రోజులు వివిధరకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు.