నూతన సంవత్సరంలో ఇస్రో అధ్భుతమైన విజయాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో భారత్ భూకక్ష్యలో తాను సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తాజాగా ఇస్రో అంతరిక్షంలో కీలకమైన శక్తివనరుల వినియోగంపై ప్రయోగం చేపట్టింది. ఈ క్రమంలో సరికొత్త ఫ్యుయల్ సెల్‌ను విజయవంతంగా దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C58 వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఎక్స్‌పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనేమనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్స్‌పోశాట్ జీవితకాలం అయిదేళ్లుకాగా కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్ బహిర్గతం చేస్తుంది.
ఇస్రో చేపట్టిన PSLV-C58 రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగ విజయం 2024 కొత్త సంవత్సరానికి శుభారంభమన్నారు. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణిత కక్షలోకి ఎక్స్‌పోశాట్ చేరుకుందన్నారు. ఈ ఉపగ్రహం లోని సోలార్ ప్యానల్స్ విచ్చుకొని బ్యాటరీలను ఛార్జింగ్ చేసే పనిని ప్రారంభించిందని తెలిపారు. 1963 తరువాత ఈ రోజు జరిగిన ప్రయోగ విజయంతో ఇస్రో 60 ఏళ్ళ చరిత్ర పూర్తి చేసుకుందన్నారు. నూతన సంవత్సరం రోజున ఈ రాకెట్ ప్రయోగ విజయం భారత ప్రజలకు ఇస్రో అందించిన బహుమతి అని సోమనాథ్ పేర్కొన్నారు. భవిష్యత్ ప్రయోగాలకు పరిశోధాత్మక ప్రయోజనాలకు ఈ ఉపగ్రహం కీలకమన్నారు.
రోదసిలో భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకునే దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని మోదీ కూడా దీనిపై మాట్లాడుతూ.. మరో పదేళ్లలో ఈ స్పేస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.