ఆశ్వయుజ శుద్ధ విదియ, సోమవారము, తేది. 16.10.2023 శ్రీకనకదుర్గమ్మవారు శ్రీగాయత్రి దేవి గా దర్శనమిస్తారు.
శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవ రోజున శ్రీకనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట.
ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధంఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.
అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెందుతారు.