Tirumala : ఓం నమో వెంకటేశాయ – బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు

By manavaradhi.com

Updated on:

Follow Us

Tirumala : ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’అంటారు అంటే దీని అర్థం మీకు తెలుసా… బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు… ఇదీ శ్లోకానికి అర్థం. ఆదేవ దేవుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఏడు కోండలు లోని తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి (Sri Venkateswara Swami) శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తులు ఆ వేంకటేశ్వరుని నామాలో ఆర్తిస్తుంటారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.

మనం ఉన్న ప్రస్తుత కలియుగారంభంలో సుమారు వేల సంవత్సరాల క్రితం ఆ భూమి మీద ఆ తిరుమల గిరులలో వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.

తిరుమల కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే స్వామివారి క్షేత్రంలో, ఆలయంలో ఉన్న ప్రాంతాలు, నిర్మాణంలో ఉన్న విశేషాలు చాలా మంది భక్తులకు తెలియదు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని దర్శనం చేసుకుని.. బయటకు వచ్చిన అనంతరం స్వామివారి తీర్ధం, శఠారి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని.. బయటకు నడుస్తుంటే.. ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వేంకటేశ్వర స్వామిని (Vimana Venkateswara Swami). గోపురంలో..వెండి మకరతోరణంలో..వెలిగిపోతున్న స్వామియే..విమాన వేంకటేశ్వరుడు. లోపల వున్న మూలమూర్తిని పోలివుంటారు. దీంతో లోపల వున్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మధన పడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామి విమానా వెంకటేశ్వర స్వామి. అంతేకాదు ఈ విమాన వేంకటేశుడి దర్శనం .. తిరుపతి యాత్రా ఫలితం ఇస్తుంది అని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం.

శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం… తిరుపతిలో పద్మావతి అమ్మవారు, బీబీనాంచారి,అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు.

Leave a Comment