బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. గత కొంత కాలంగా.. ప్రతి రోజూ, ప్రతి వారమూ, ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త జీవన కాల గరిష్టాల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. దీంతో సామాన్యులకు బంగారం అందకుండా పోతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,700కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,77,350కి చేరుకుంది.
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి, గత ఏడాదిలో బంగారం 65 శాతం పెరిగింది. రెండేళ్లలో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రెట్టింపు అయ్యింది. 2026 నాటికి గ్రాము బంగారం రూ.15,000, కిలో వెండి రూ.2 లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం లభ్యత పరిమితం కావడం, ప్రపంచ అనిశ్చితి, ఆర్థిక వృద్ధి మందగించడం, వివిధ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు పెరగడం వంటి అనేక కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోంది. వెండి, రాగి ఇతర లోహాలు కూడా ఇదే కారణంతో ధరలో పెరుగుదలను చూస్తున్నాయి. అదనంగా ఈ లోహాలను పారిశ్రామిక అనువర్తనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా నుంచి వచ్చే వస్తువులు, ఉత్పత్తులపై 100 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తానని హెచ్చరించారు. దీంతో అనిశ్చితి మరింత పెరిగింది. ఇలా ఆపద సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి.. డిమాండ్ పెరుగుతున్న క్రమంలో రేట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఇది మరోసారి యూఎస్- చైనా ట్రేడ్ వార్‌కు దారితీస్తుందన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోనూ పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వెరసి బంగారం ధర ఇంకా పెరుగుతూ వెళ్తోంది.








