దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రోజు రోజుకు చుక్కలు తాకుతోంది.. సామాన్యులకు కోనాలంటే భారంగా మారుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, పండగల సీజన్ కలిసొచ్చి పసిడి దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో రూ.1.35 లక్షలు దాటి పరుగులు పెడుతోంది. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర (Gold Prices In Hyderabad) రూ.1,35,250కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల ధర రూ.1,21,725కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,81,000కి చేరింది.
అమెరికా షట్‌డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. మరోవైపు, ధనత్రయోదశి నాడు ప్రజలు బంగారం, వెండి, విలువైన ఇతర పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆ సెంటిమెంట్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది. దాంతోపాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.









