పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంది.
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఓడరేవు ప్రాంతమంతా వర్షం నీరు నిండి.. చేపల వ్యాపారులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి, అనంతవరం, తదితర ప్రాంతాల్లో వర్షాలకు వరినాట్లు నీట మునిగాయి. రెండు వారాల క్రితమే నాట్లు వేశామని రైతులు చెబుతున్నారు. పొలాల పైనుంచి వర్షం నీరు ప్రవహిస్తోంది. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.