రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది.
ఈ కొత్త విధానం రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధం చేయడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వేస్.
కొత్త నిబంధనల ప్రకారం, ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లలో తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట బరువు పరిమితులను నిర్ణయించింది. ఈ పరిమితులను మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
వివిధ కోచ్లకు లగేజీ నియమాలు ఇలా
ఫస్ట్ ఏసీ (1st AC): ఫస్ట్ ఏసీలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. దీనికి అదనంగా 15 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
AC 2-Tier: ఈ కోచ్లో 50 కిలోల వరకు లగేజీ ఉచితం. అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చు.
AC 3-Tier / స్లీపర్ క్లాస్ (Sleeper Class): ఈ రెండు క్లాసుల్లో ప్రయాణికులకు 40 కిలోల వరకు లగేజీ ఉచితం. దీనికి అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లే అవకాశం ఉంది.
సెకండ్ క్లాస్ (Second Class): సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 35 కిలోల వరకు లగేజీ ఉచితంగా అనుమతించబడింది. దీనికి అదనంగా 10 కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లవచ్చు.
నిర్ణీత పరిమితిని మించి లగేజీని తీసుకెళ్లేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణ సమయంలో టీటీఈ తనిఖీ చేసి, బుక్ చేయని అదనపు లగేజీని గుర్తించినట్లయితే, సాధారణ ఛార్జీల కంటే ఆరు రెట్లు ఎక్కువ ఫైన్ విధించే అవకాశం ఉంది.
ఈ కొత్త విధానం వల్ల ప్రయాణీకులకు సౌకర్యం, భద్రత పెరుగుతాయి. రైలు బోగీల్లో అధిక లగేజీ వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్రాజ్ డివిజన్లోని ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్ వంటి వాటిలో అమలు చేయనున్నారు. ఈ చర్యతో రైల్వే ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుందని అధికారులు తెలిపారు.