హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. రాజకీయ శక్తిగా తిరిగివస్తానని వ్యాఖ్యానించారు. అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నానని.. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని.. ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
‘‘బీఆర్ఎస్లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని తెలిపారు. పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్షగట్టి… అక్కడే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు నాకు అండగా నిలవలేదు. కేసీఆర్పై కక్షతో భాజపా నన్ను జైలులో పెట్టించింది కవితా అన్నారు.
పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. ఒక్క వర్షానికే సిద్దిపేటలో కలెక్టరేట్ కొట్టుకుపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీలో కోరాను. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనూ పట్టించుకోలేదు అని కవిత అన్నారు.










