జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “కర్మ హిట్స్ బ్యాక్” అంటూ ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరి పేరును గానీ, ఏ పార్టీ పేరును గానీ, ఏ అంశాన్ని గానీ ప్రస్తావించకుండా ఆమె కేవలం మూడు పదాల్లో ట్వీట్ చేయడం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరుణంలో ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ సుమారు 24 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలోనే కవిత ఈ ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు









